Chandrababu at SIT Office: ఆందోళన చెందొద్దని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
family members meets Chandrababu at SIT Office:సీఐడీ సిట్ కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. అనంతరం చంద్రబాబును వారు పరామర్శించారు.
family members meets Chandrababu at SIT Office:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు. అంతకుముందే సీఐడీ సిట్ కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, వియ్యంకుడు బాలకృష్ణలను నాల్గవ ఫ్లోర్ లో కూర్చోబెట్టారు. 5వ ఫ్లోర్ లో చంద్రబాబును సిట్ అధికారులు ముందుగా తాము ప్రిపేర్ చేసుకున్న ప్రశ్నల్ని సంధించి కొన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కుటుంబసభ్యులను చంద్రబాబును కలిసేందుకు అనుమతించారు.
కుటుంబసభ్యులు చంద్రబాబును పరామర్శించారు. అయితే మీరెవరు ఆందోళన చెందవద్దు అంటూ కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ధర్మం తనవైపే ఉందని, కుట్ర రాజకీయాలను తాను సమర్థవంతంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. చంద్రబాబుతో మాట్లాడాక కుటుంబసభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మొదటగా భువనేశ్వరి, లోకేష్ మరికొందరు కుటుంబసభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలక్రిష్ణ, బ్రాహ్మణి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు చేరుకున్న కొంత సమయానికి చంద్రబాబును కుటుంబసభ్యులు కలిసి కేసు విషయంపై చర్చించారు. విచారణ మధ్యలో తన లాయర్ ను చంద్రబాబును కలిసి కేసు విషయం వివరించినట్లు తెలుస్తోంది.
హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
చంద్రబాబు అరెస్టుపై ఆయన తరపు లాయర్లు శనివారం రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లీగల్ సెల్ న్యాయవాదులు న్యాయమూర్తి ఇంటికి వెళ్లి పిటిషన్ ఇచ్చారు. చంద్రబాబును నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, మరోవైపు ఆయనను అరెస్టు చేసి చాలా గంటలు గడిచిందని పిటిషన్‌లో లాయర్లు పేర్కొన్నారు. చంద్రబాబు వయసును పరిగణనలోకి తీసుకుని ఆరోగ్యరీత్యా 24 గంటల్లోపు ఆయనను కోర్టులో హాజరు పరచాలని కోరారు. మరోవైపు సిట్ ఆఫీసులో అధికారులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ఆలస్యం కావడంతో చంద్రబాబు వైద్య పరీక్షలకు సైతం జాప్యం జరిగింది. ఈ కారణాలతో చంద్రబాబును మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు చాలా ఆలస్యమైంది.