Kanna Lakshminarayana: మోదీ అంటే అభిమానం, కానీ ఇమడలేకపోయా, సోమువీర్రాజు ప్రవర్తన నచ్చలేదు - కన్నా
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని, మోదీ నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశానని కన్నా అన్నారు.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడిని అయ్యానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఆ నాటి నుంచి పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా ఓ కార్యకర్త తరహాలో పని చేసుకుంటూ వచ్చానని గుర్తు చేసుకున్నారు. తన పనిని గుర్తించి 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని, మోదీ నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశానని అన్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా బీజేపీలో చేరారని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నామని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడామని అన్నారు. మోదీ అంటే జీవితకాల అభిమానం ఉన్నప్పటికీ పార్టీలో ఇమడలేకపోయానని అన్నారు.
కన్నా వ్యాఖ్యలపై ఎంపీ జీవీఎల్ స్పందన
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. అంతకుముందు తాను స్పందించబోన్న ఆయన కన్నా లక్ష్మీ నారాయణ మీడియా సమావేశం నిర్వహించాక స్పందించారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పిందని అన్నారు. సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారని అన్నారు.
అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఏ నిర్ణయాలూ తీసుకోలేదని, తాను కూడా తన బాధ్యతకు లోబడే పని చేశానని చెప్పారు.
ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక
కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరులోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సీనియర్ నేత, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి జాబితాలో కూడా కన్నా పేరు వినిపించింది. అంతటి సీనియర్ నేత పరిస్థితులు, మారిన రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వచ్చారు. వచ్చీరాగానే ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీకి కూడా రాజీనామా చేసి తర్వాత ఏ పార్టీలో చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది.
కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కాపు రిజర్వషన్ల అంశం వచ్చినప్పుడు చంద్రబాబును పొగిడారు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ తీరుపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం అందుకున్న పార్టీ ఆయన్ని ఆహ్వానించడానికి క్యూ కట్టారు. అలా ఆహ్వానించిన పార్టీల్లో టీడీపీ, జనసేన, వైసీపీ ఉన్నాయి. ఆయన మాత్రం అన్ని అంచనాలు వేసుకున్న తర్వాత... అనుచరులతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు.