Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో గుణదల మేరీ మాత ఉత్సవాలు నిర్వాహించటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది సైతం ఉత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రసిద్ద పుణ్య క్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు ఈ నెల 9 ,10 ,11 తేదీలలో జరగనున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రానున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు...
ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో గుణదల మేరీ మాత ఉత్సవాలు నిర్వాహించటం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది సైతం ఉత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్న ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు రానున్నారని వారికి అన్ని ఏర్పాట్లు సర్వ సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మేరీమాత ఉత్సవాలు సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్య ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుణదల పుణ్యక్షేత్రం నిర్వాహకులు, ఉత్సవ నిర్వాహకులు ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తెలిపారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు రానున్నారని చెప్పారు.
భారీ పోలీసు బందోబస్తు...
పవిత్ర గుణదల మాత మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ పరంగా అన్ని భద్రత చర్యలు చేపట్టామని డిసిపి విశాల్ గున్ని తెలిపారు. మేరీ మాత మహోత్సవ ప్రాంగణాన్ని, డిసిపి విశాల్ గున్ని పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులకు భద్రతా విషయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేరీ మాత మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న క్రమంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు చెప్పారు. మూడు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. కోల్ కత్తా జాతీయ రహాదారికి దగ్గరలోనే గుణదల కొండ ప్రాంతం ఉండటంతో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గుణదల మాత చరిత్ర ఇది...
బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసఫ్ ఇనిస్టిట్యూట్ పేరుతో అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. ఇనిస్టిట్యూట్ కు డైరెక్టర్‌గా ఇటలీకి చెందిన ఫాదర్ పి. అర్లాటి ని నియమించారు. ఆయనే గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. అప్పటి నుండి మేరిమాత ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావటం ఆరంభం అయ్యింది. 1933లో ఫాదర్ అర్లాటి చేతులు మీదగా గుణదల కొండ శిఖరం పైన శిలువ ను ప్రతిష్ఠించారు. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కథోలికులు, ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండ పైన ఆరోగ్యమాత విగ్రహాన్ని నెలకొల్పారు.గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు.
కలరా, కరోనాతో తిరునాళ్ళకు బ్రేక్...
1946 నుండి తిరునాళ్ళు ఘనంగా జరుగుతున్నాయి.1948లో కలరా ప్రబలటంతో తిరునాళ్ళు నిర్వహించలేదు.. ఆ తరువాత ఇటీవల మరో సారి కరోనా కారణంగా గుణదల మాత ఉత్సవాలను రద్దు చేయాల్సి వచ్చింది.