క్యాన్సర్‌పై అవగాహన కోసం విజయవాడలో 5కె రన్- ప్రారంభించనున్న గవర్నర్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)-గ్లోబోకన్ లెక్కల ప్రకారం భారతదేశంలో 2020 సంవత్సరంలో 1.3 మిలియన్ల కొత్త కేసులను గుర్తించారు. 1990-2016 మధ్యలో 39.1 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు కనుగొన్నారు.
క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఆదివారం (9వ తేది) ఉదయం 6.30 గంటలకు విజయవాడ 5కే రన్ నిర్వహించనున్నారు. బీఆర్డీఎస్ రోడ్డులో నిర్వహించే 5కె, 2కె రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిడెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్ డాక్టర్ పి. గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో క్యాన్సర్‌ను నివారించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేయూత అందిస్తున్నారని, వైద్య, ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు గౌతమ్ రెడ్డి. రాష్ట్రంలో తీసుకొని వచ్చిన వైద్య విప్లవంలో భాగంగా ఒక్క నాడు - నేడు ద్వారా సుమారు 20,000 ఆసుపత్రులను ఆధునీకరించారని గుర్తు చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను స్థాపించి, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో 3 వేలకుపైగా జబ్బులకు ఉచితంగా వైద్యం అందించడం, క్యాన్సర్ మీద ఎంతైనా ఖర్చు చేయటానికి వెనుకాడకుండా ఉండటం ఎంతో అభినందించదగ్గ విషయమని గౌతమ్‌రెడ్డి కొనియాడారు. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే మంచి చికిత్స తీసుకోవచ్చని, తద్వారా జీవితకాలం పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ లో నిర్వహించే 5కె రన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి జోగి రమేష్, ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొంటారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోటి మందికిపైగా ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న క్యాన్సర్ మహమ్మారి, అతి వేగంగా ప్రజల్లో వ్యాప్తి చెందుతుందన్నారు. భారత దేశంలో 10 నుంచి 14 లక్షల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని తెలిపారు.
పొగాకు వలన 22% కంటే ఎక్కువ మంది, ఊబకాయం, సరైన వ్యాయామం లేకపోవటం వలన మరో 10% మంది, మద్యపానం సేవించటం ద్వారా కూడా ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారన్నారు గౌతమ్ రెడ్డి. ఈ క్యాన్సర్ సుమారుగా 100 పైగా రకాల్లో ప్రజల మీద దాడి చేస్తుంటే.. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, సెరివికల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ ఉంటున్నాయని తెలిపారు. మన దేశంలో మహిళలు సమస్యను బయటకు చెప్పులేకపోవడం వలన ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)-గ్లోబోకన్ లెక్కల ప్రకారం భారతదేశంలో 2020 సంవత్సరంలో 1.3 మిలియన్ల కొత్త కేసులను గుర్తించడం జరిగిందన్నారు గౌతమ్‌రెడ్డి. 1990-2016 మధ్యలో 39.1 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు కనుగొన్నారని తెలిపారు. 2020లో 13.5 శాతం మహిళల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారని వివరించారు. ఇది తొలి దశలో గుర్తిస్తే ఈ మహమ్మారిని అతి సులువుగా జయించవచ్చని.. దీనికోసం గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెస్ట్-ట్రేస్-ట్రీట్-ట్రాన్స్ ఫామ్ (4T) విధానంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.
గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ కు ఉన్న 7 మొబైల్ బస్సులలో కేన్సర్ ను కనుగొనే అత్యాధునితమైన వైద్య పరికరాలు ఉన్నాయని.. ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు గౌతమ్ రెడ్డి. ఈ పరీక్షలు చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి వారికి కావలసిన వైద్య సలహాలు, సూచనలు నిఫుణులతో ఇవ్వడమే కాకుండా సరైన వైద్య విధానం అందిచడం జరుగుతుందని గౌతం రెడ్డి తెలిపారు.