Govt Employees Strike Call: చలో విజయవాడకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, అప్రమత్తమైన జగన సర్కార్ నేడు చర్చలు
APJAC Agitation: వేతనాలు పెంపు సహా డిమాండ్ల సాధన కోసం మరోసారి ఉద్యమించనున్న ఏపీ ఉద్యోగులు, ఈనెల 27న చలో విజయవాడకు పిలుపు; నేడు జేఏసీ నేతలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం
Andhra Pradesh Employes Agitation: సీపీఎస్(CPS) రద్దు సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్(Jagan) ఆ తర్వాత మాట తప్పడంతో వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వేతనాలు పెంపు సంగతి దేవుడెరుగు... ఫస్ట్ తారీఖు జీతం వస్తే చాలురా దేవుడా అనే వరకు ఏపీలో పరిస్థితులు దిగజారాయి. ప్రభుత్వం ఇస్తామన్న బెనిఫిట్స్ పక్కనపెడితే..తాము దాచుకున్న సొమ్ములు సైతం ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. గతంలో పెద్ద ఎత్తున ఉద్యమించినా ప్రభుత్వం మాయమాటలతో మరోసారి లొంగదీసుకుంది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఉద్యోగులు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 27న చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సమ్మెకు సై..!
ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి సిద్ధమైనట్లు ఏపీజేఏసీ(APJAC) ప్రకటించింది. 104 ఉద్యోగ సంఘాలు, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఏపీజేఏసీ నేతలు ఈమేరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమ శంఖారావం పోస్టర్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 27న ఉద్యోగులతో చలో విజయవాడ(Vijayawada) చేపట్టబోతున్నట్టు తెలిపారు. 14న నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల్లో వినతులు సమర్పించాలని నిర్ణయించారు. 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో పాఠశాలల్లో నిరసన చేపట్టనున్నారు. 17న తాలుకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు.. 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేయనున్నట్టు వారు వివరించారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 27న చలో విజయవాడ కార్యక్రమం భారీగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తమ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం మెరుపు సమ్మేనన్నారు.
చిత్తశుద్ధిఏదీ ?
ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఉద్యోగసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమే గాక....గతంలో తాము ఆందోళనకు దిగిన సమయంలో మంత్రిమండలి ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగుల డీఏ(DA) సొమ్ములు ఇప్పటికీ ఖాతాల్లో పడలేదన్నారు. 12వ పీఆర్సీ(PRC) కమిషన్ ఎక్కడుందో తెలీదని, కనీసం కార్యాలయం, స్టాఫ్ కూడా లేరన్నారు. రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉందని, జీపీఎఫ్(GPF) బిల్లుల చెల్లింపులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నేడు ప్రభుత్వం చర్చలు
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సై అనడంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. సానుకూల నిర్ణయం రాకపోతే అప్పుడు సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీవో(APNGO)లు తెలిపారు.ముఖ్యంగా ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని గట్టిగా కోరుతున్నాయి. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడు అన్నట్లు ఎన్నికల ముందు అయితేనే ప్రభుత్వాలు దిగివస్తాయని సమయం చూసి ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎన్నిక విధులతోపాటు పరీక్షల సమయం దగ్గరపడిన సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమ్మెపై అటు ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది.