Venkat Reddy: నేడు కోర్టు ముందుకు గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి- ఆయన అరెస్టులో హైడ్రామా!
Hyderabad: ఇసుక, మైనింగ్ అక్రమాల్లో కేంద్ర బిందువుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ప్రభుత్వ అధికారులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో ఇప్పటికే చాల మంది లూప్‌లోనో, పరారీలో ఉన్నారు. అలాంటి జాబితాలో ఉన్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజి వెంకట్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. గత ఐదేళ్లుగా ఇసుక, ఖనిజ, గనుల శాఖలో ఈయన మాటే శాసనంగా సాగిందని కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే అక్రమాలపై ఫిర్యాదు చేసింది. విచారణ చేసేందుకు ఆయన కోసం మూడు నెలలుగా ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు. తప్పించుకొని తిరుగుతున్న ఆయన్ని ఎట్టకేలకు రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
గురువారం రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌లో వీజి వెంకట్‌రెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గనుల శాఖలో టెండర్లు, అగ్రిమెంట్స్, ఏపీఎంఎంసీ రూల్స్ పాటించకుండా చర్యలు, ఇసుక తవ్వకాల్లో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు ఇచ్చేందుకు అప్పటి నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదు. దీనికి తోడు ఈ అభియోగాలపైనే వెంకటరెడ్డిపై ఈ నెల 11న ఏసీబీకి గనుల శాఖాధికారుల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో నేరపూరిత విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల ఆయనపై ఏసీబీ కేసు నమోదుచేసింది.
గురువారం రాత్రి వెంకటరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మరి కాసేపట్లో విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఆయన్ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్లలో ఇసుక విధానంతో రూ.2,566 కోట్లు దోచినట్టు ఆరోపణలు ఉన్నాయి. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ లాంటి సంస్థలతో కుమ్మక్కై దోపిడీకి తెరలేపారని అభియోగాలు ఉన్నాయి. ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యంగా చేసినా పట్టించుకోలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. బకాయిలు చెల్లించకుండానే కాంట్రాక్ట్ సంస్థల డిపాజిట్‌లను వెనక్కి ఇచ్చేశారని కూడా చెబుతున్నారు. కేంద్ర సంస్థలను, కోర్టులను కూడా తప్పుడు అఫిడవిట్స్‌తో మోసం చేశారనే విమర్శలు ఉన్నాయి. అన్నింటిని నిగ్గుతేల్చేందుకు కేంద్రబిందువుగా ఉన్న వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది.
వాస్తవానికి వెంకటరెడ్డి ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019లో డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ వచ్చారు. మొదట విద్యాశాఖలో ఉన్న ఆయనకు 2020లో గనులశాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వ పెద్దల అండతో దోపిడీకి పాల్పడటమే కాకుండా 2014-19 మధ్య ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై సీఐడీ కేసులు కూడా పెట్టించారని ఆరోపణ ఉంది.
వెంకటరెడ్డి అరెస్టుతో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈయన కేంద్రం అక్రమాల జరిగాయని ఇప్పుడు వెంకట రెడ్డి నోరు విప్పితే మరిన్ని అరెస్టులు ఖాయమంటున్నారు. ఎందుకంటే అప్పట్లో ఉన్న ఉచిత ఇసుక విధానం రద్దు చేసి దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచన ఈయనదేనంటున్నారు. ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే టెండర్లు దక్కేలా రూల్స్ ఫ్రేమ్ చేసినట్టు చెబుతారు. అందుకే ఆయన అరెస్టు కీలకంగా మారనుందని అంటున్నారు.
Also Read: వెంకట్రామిరెడ్డి నిర్వాకంతో సచివాలయ ఉద్యోగ సంఘం రద్దు - ఆయన ఉద్యోగమైనా కాపాడుకోగలరా ?