Chandrababu: ఆగస్టు 15 నుంచి వంద అన్నా క్యాంటీన్లు, గుడివాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Anna canteens: అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభిస్తోంది. ఆగస్టు 15 న గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు.
AP CM Chandrababu Will Start One Hundred Anna Canteens : సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం ద్వారా ఈ పథకం పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉండడంతో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం ద్వారా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
తొలి దశలో అందుబాటులోకి తీసుకువస్తున్న అన్నా క్యాంటీన్లు జిల్లాల్లో ఎంపిక చేసిన 33 పురపాలక, నగర పాలక సంస్థల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నప్పటికీ 16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.
అక్షయ పాత్రకు అన్న క్యాంటీన్ల ఆహార పంపిణీ కాంట్రాక్ట్
రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న అన్నా క్యాంటీన్లు ద్వారా ఆహారం అందించే కాంట్రాక్ట్‌ను అక్షయ పాత్ర దక్కించుకుంది. ఈ మేరకు మంత్రి నారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ ఏర్పాట్లను పరిశీలించినట్టు వెల్లడించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్లు అప్పటి తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో 180 చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ క్యాంటీన్లు ద్వారా నాణ్యమైన భోజనాన్ని రూ.5కే అందించామని, మొత్తంగా 4.60 కోట్ల మందికి శుభ్రతతో కూడిన రుచికరమైన భోజనాలు అందించినట్టు మంత్రి వివరించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిని పూర్తిగా తొలగించేసిందన్న మంత్రి.. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వీటిని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్లడిచంఆరు. పట్టణ ప్రాంతాల్లో 180 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. గ్రామీణ ప్రాంతాల్లో 200కుపైగా క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. పేద వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాలైన మార్కెట్లు, ఆస్పత్రులు వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ప్రతి నిరుపేద ఆకలిని తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.