పెంపుడు కుక్కను గన్‌తో కాల్చి చంపిన పాస్టర్- విచారిస్తున్న పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కను ఓ పాస్టర్ కాల్చి చంపడం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ పాస్టర్ చేసిన పని ఇప్పుడు తెగ చర్చనీయాంశమవుతోంది. గతంలో ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్‌లో విధులు నిర్వహించి హెమర్టన్ తన పెంపుడు కుక్కను చంపడం వివాదానికి కారణమైంది. పోలీసు ఉద్యోగంలో ఇమడలేక రాజీనామా చేసి బయటకు వచ్చేసిన హెమర్టన్ మిషనరీ సంస్థల్లో చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నారు. అన్ని జీవులను దయతో చూడాలని చెప్పే ఆయనే ఇలాంటి పని చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పాస్టర్ హెమర్టన్ తన ఎయిర్‌గన్‌తో పెంపుడు కుక్కను కాల్చారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు ఆయన్ని నిలదీశారు. కుక్క ఇబ్బంది పెడుతుందని కాల్చి చంపడమేంటని ప్రశ్నించారు. చుట్టుపక్కలే పిల్లలు, స్థానిక ప్రజలు తిరుగుతుంటారని పొరపాటున వాళ్లకు ఆ బులెట్ తగిలితే పరిస్థితి ఏంటని ఆయన్ని క్వశ్చన్ చేశారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడవిరావులపాడులో నివాసం ఉంటున్న పాస్టర్ హెమర్టన్ తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను నిన్న సాయంత్ర కాల్చారు. కుక్క గట్టిగా అరుస్తూ బయటకు వచ్చింది. దీన్ని స్థానికంగా ఉండే వ్యక్తి గమనించాడు. అరుస్తూ వచ్చిన కుక్క కిందపడిపోయింది. కాసేపటికే చనిపోయింది. దీన్ని రోడ్డుపైనే ఆ పాస్టర్ పడేశారు. దాన్ని గమనించిన ఆ వ్యక్తి మళ్లీ కుక్కను తీసుకొచ్చి వాళ్ల ఇంటి ముందే వేశాడు.
కుక్కను ఎందుకు చంపారంటూ పాస్టర్‌ను నిలదీశారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి గ్రామంలో ఉంటున్న మిగతా వాళ్లకు సమాచారం చేరవేశారు. నిత్యం జనం తిరుగుతుండే ప్రాంతమని ఇలాంటి దుర్ఘటనలు మనుషలపై కూడా చేయరని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. దేనికీ ఆయన నుంచి సమాధానం రాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.
పోలీసులు వచ్చేలోపు ఆ కుక్క మృతదేహాన్ని పాస్టర్ హెమర్టన్ పాతి పెట్టారు. దాన్ని వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించార. అసలు ఎయిర్‌గన్ ఏ పరిస్థితిలో వాడాల్సి వచ్చిందో... కుక్కను ఎందుకు చంపాల్సి వచ్చిందో ఆరా తీస్తున్నారు. ఇది మాత్రం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.