Bonda Uma: న్యాయం అడిగితే మాకే నోటీసులా? వాసిరెడ్డి పద్మపై మాపైనే దాడి చేయబోయారు - బోండా ఉమ
విజయవాడ ఘటనపై న్యాయం చేయాలంటూ తాము కోరితే రివర్స్ లో తమకే నోటీసులు పంపుతారా? అంటూ బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో సామూహిక అత్యాచార బాధితురాలి విషయంలో జరిగిన వాగ్వాదాలపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబుకు, తనకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీరుపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై న్యాయం చేయాలంటూ తాము కోరితే రివర్స్ లో తమకే నోటీసులు పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ విధులను, అధికారాలను వాసిరెడ్డి పద్మ దుర్వినియోగం చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
నరకం చూపించారు
అత్యాచార బాధితురాలికి 30 గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో నరకం చూపించారని ఆరోపించారు. చంద్రబాబు పరామర్శకు వెళుతున్నారని తెలిశాకే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందని బోండా ఉమ అన్నారు. చంద్రబాబుతో పాటు తాము వచ్చినప్పుడే వాసిరెడ్డి పద్మ వచ్చారని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరినంత మాత్రాన బెదిరిస్తారా? అంటూ నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిలో దారుణం జరిగితే సిబ్బంది బాధ్యత తీసుకోరా? అని నిలదీశారు.
హైకోర్టుకు వెళ్తాం: బోండా
మహిళల మానాలకు వైసీపీ ప్రభుత్వం వెల కడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వలంటీర్లను వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ వలంటీర్లకు నోటీసులు ఇవ్వకుండా తమకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని బోండా ఉమ నిలదీశారు. వాసిరెడ్డి పద్మ వ్యవహారంపై తాము హైకోర్టుకు వెళతామని, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచార ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఏప్రిల్ 22) బోండా ఉమతో కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అంతకుముందే వాసిరెడ్డి పద్మ కూడా అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు ఎదుటే టీడీపీ నేతలు - వాసిరెడ్డి పద్మ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వం ఏం చేస్తుందని... ఎందుకు ఇలాంటి సంఘటనలు ఆపలేకపోతున్నారని నిలదీశారు. ఇదే ఇప్పుడు వివాదాన్ని సృష్టించింది.
రేప్ ఘటనపై విచారణ నిమిత్తం వెళ్లిన తనను చంద్రబాబు సహా టీడీపీ నేతలు అడ్డగించారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. , టీడీపీ నేతలు తనపై దాడులు చేశారని ఆమె ఆరోపించారు. దీంతో ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఆఫీసులో విచారణకు రావాల్సిందిగా చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు.