Beggar Donates 10 Lakhs: బెజవాడలో బిచ్చగాడు-3, యాచించిన 10లక్షలు ఆలయం నిర్మాణానికి విరాళం
విజయవాడలో ఓ యాచకుడు సాయిబాబా ఆలయానికి దాదాపు 10లక్షలు విరాళం ఇచ్చి దాతృత్వం చాటుకున్నాడు. ఏ ఆలయం ముందు అయితే బిచ్చం ఎత్తుకుంటాడో అదే ఆలయం అభివృద్ధికి విరాళం
బిచ్చగాడు సినిమా చూశాం కదా అందులో హీరో ఓ కోటీశ్వరుడు... అయినా అందరి వద్ద బిచ్చం ఎత్తుకుని వచ్చిన సొమ్ములో తన అవసరాలు పోను మిగిలినది మొత్తం హుండీలో వేసి మళ్లీ ఆ దేవుడికే తిరిగి ఇస్తాడు. సరిగ్గా అలాంటి బిచ్చగాడే మన విజయవాడలో తారసపడ్డాడు. కాకపోతే ఈయన మన హీరోలా బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదులెండి. కాకపోతే మిగిలిన వ్యవహారమంతా సినిమాలో చూపించిన విధంగానే ఉంటుంది. గుడి ముందు చేయి అడుక్కుని సంపాధించిన సొమ్ములో తన అవసరాలు పోనూ మిగిలినది మొత్తం తిరిగి ఆ దేవుడికే ఇచ్చేస్తుంటారు. అలా ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి కోసం ఏకంగా పదిలక్షల వరకు ఇచ్చాడంటే నమ్మశక్యం కావడం లేదు కదూ....
ఈ బిచ్చాధికారి లచ్చాధికారి
విజయవాడ(Vijayawada) ముత్యాలంపాడులో శ్రీ షిర్డీసాయి ఆలయం(Sai Baba Temple) చాలా ఫేమస్. నిత్యం పెద్దసంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుంటారు. గురువారం, పర్వదినాల సమయంలో భక్తుల సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఈ ఆలయం వద్ద యాదిరెడ్డి అనే వృద్ధుడు బిచ్చగాడి జీవనం సాగిస్తున్నాడు. భక్తులను చేయిచాచి అడుక్కున్న డబ్బులను రూపాయి రూపాయి పోగేసి లక్షరూపాయలు చేశాడు.
తనకు రెండ పూటలా తిండి దొరకడానికి...ఈ లక్ష రూపాయలు కూడబెట్టడానికి ఆ బాబా చలవేనని భావించాడు. అందుకే ఈ డబ్బులు ఆలయ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలని నిర్ణయించాకున్నాడు. ఆ డబ్బును మందిర గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. ఆలయ అవసరాలకు ఈ సొమ్ము ఖర్చు చేయాలని కోరారు.
దాదాపు పది లక్షలు విరాళం
బిచ్చగాడు యాదిరెడ్డి బాబా మందిరానికి విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా రూ.8,54,691 అందజేశారు. ఇప్పుడు ఇచ్చిన లక్షరూపాయులు కలుపుకుంటే అక్షరాల 9,54,691 ఇచ్చినట్లవుతుంది. ఆ బాబా ఇచ్చిన సొమ్ము మళ్లీ తిరిగి ఆయనకే ఇచ్చాను తప్ప..తాను చేసిన గొప్పతనం ఏమీ లేదని యాదిరెడ్డి వినమ్రయంగా చెప్పారు. మున్ముందు కూడా ఇకపై తాను సేకరించే ప్రతి పైసా దేవుడికే ఇస్తానన్నారు. ఆలయానికి విరాళం అందజేసిన యాదిరెడ్డిని ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.
గతంలోనూ చాలామంది యాచకులు ఆలయాలు, అనాథ శరణాయాలు, వృద్ధాశ్రమాలకు సొమ్ము విరాళాలు ఇచ్చారు. కష్టపడి రూపాయి, రూపాయి కూడబెట్టిన సొమ్ము విరాళంగా ఇవ్వడంలోనే తమకు ఆత్మ సంతృప్తి ఉందంటారు. పైగా ఈ సొమ్ము అనుభవించడానికి గానీ, ఆనందించడానికి గానీ నా అనే వారు ఎవరూ లేకపోవడంతో...వారికి డబ్బుమీద అంతగా వ్యామోహం ఉండదు. తమకు కూడు, బట్ట వెళ్లిపోతే చాలనుకుంటారు. మరికొందరు లక్షల రూపాయలు యాచక వృత్తిలోనే సంపాధించి సొంతంగా ఇల్లు, బైకులు కొనుక్కునేవారు ఉంటారు. ఇటీవల ముంబయిలో ఓ వ్యక్తి ఏకంగా వాళ్ల పిల్లలిద్దరినీ కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తన కుమారులు, భార్యకు అందరికీ తెలుసంటాడు. కొందరు యాచక వృత్తిని ఛీదరించుకున్నా..మరికొందరు దాన్నే దైవంగా భావిస్తుంటారు. ముఖ్యంగా సన్యాసులు యాచక వృత్తి ఆ పరమశివుడి భిక్షగా స్వీకరిస్తారు.