AP Kapu Reservations: కాపులకు రిజర్వేషన్లతో ఏ ప్రయోజనం ఉండదు, వాళ్లను నమ్ముకుంటే వేస్ట్: మాజీ సీఎస్ రామ్మోహన్ రావు
Kapu Reservations in AP: ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు అన్నారు.
Tamil Nadu Ex CS Ram Mohan Rao on Kapu Reservations: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి ఏపీలో తెరపైకి వచ్చే అంశాలలో కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఒకటి. ఏపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ దిశగా అడుగులు వేస్తోంది. వీరికి ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ నేతలు వాదిస్తుంటారు. ఈ క్రమంలో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కాపులకు బీసీల రిజర్వేషన్లు కల్పించరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కాపులకు బీసీ రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాపులకు సమష్టి నాయకత్వం కావాలని రామ్మోహన్ రావు అన్నారు.
పౌరుషం అడ్డుకట్ట వేస్తోంది..
రాజకీయంగా, వ్యాపారపరంగా తాము అభివృద్ధిలోకి రాకపోవడానికి పౌరుషం అనేది కారణం అన్నారు. ఇది తమ అభివృద్ధికి పెద్ద అడ్డకట్ట అని.. అలాగని మనం పౌరుషం లేకుండా బతకమని చెప్పడం తన ఉద్దేశం కాదన్నారు. కాపు సామాజిక వర్గం లోనే నువ్వు గొప్పనా, లేక నేను గొప్పనా అనే తారతమ్యాలు తీస్తారని, ఇలాంటి ఆలోచనలు వస్తున్న కారణంగా కాపులం అభివృద్ధిలోకి రాలేక పోతున్నామని చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మార్పు రాదని.. కాపులు బీసీ రిజర్వేషన్ కోసం పాకులాడొద్దు అని సూచించారు.
రిజర్వేషన్ల వల్ల ఏ ప్రయోజనం ఉండదు..
రాజకీయ అధికారం దక్కించుకుంటేనే కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని, కానీ రిజర్వేషన్ల వల్ల ఏ ప్రయోజనం చేకూరదన్నారు. 4 శాతం జనాభా ఉన్న వారే రాజ్యాన్ని ఏలుతున్నారని వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు అడగటం ద్వారా బీసీలకు వ్యతిరేకులం అయ్యామన్నారు. బీజేపీ, లేక ఇతర ఏ పార్టీలు హామీ ఇచ్చినా సరే రిజర్వేషన్ల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మిగతా సామాజిక వర్గం తరహాలో కల్చరల్ మూమెంట్ గట్టిగా లేదని, ఆర్థికంగా పటిష్టంగా లేకపోతే రాజకీయాల్లోకి వెళ్లినా నిలదొక్కుకోవడం సాధ్యం కాదన్నారు. మేం రాజకీయాల్లోకి వెళతాం, సీఎం అవుతాం అని చెబితే అది ఎదురీత లాంటిదన్నారు. 20 శాతం ఉన్న సమాజికవర్గాలకు 75 ఏళ్లుగా రిజర్వేషన్లు ఉన్నాయి, వారు సీఎం అవ్వాలి కదా, కానీ ముఖ్యమంత్రులు కాలేకపోయారని వ్యాఖ్యానించారు.
కాపు కమ్యూనిటీ ఇంకా మెచ్యూరిటీ తెచ్చుకోలేదని, సినిమా వారినో, పారిశ్రామిక వేత్తలనో నమ్ముకుంటే మనకు ప్రయోజనం ఉండదన్నారు. సమిష్టిగా అడుగులు వేస్తేనే ఏదైనా సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందన్నారు రామ్మోహన్ రావు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వదని, ఇచ్చినా కాపులు బాగుపడేది ఏమీ ఉండదన్నారు. రిజర్వేషన్ ద్వారానే రాజకీయ ప్రయోజనం ఉండదని, కేవలం రాజకీయంగా రాణించడం ద్వారా కాపులు అభివృద్ధి చెందుతారని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. గతంలో కాపులకు రిజర్వేషన్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినా, అమలులోకి మాత్రం రాలేదు. సీఎం జగన్ మాత్రం ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పగా.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి పూర్తి నిర్ణయాధికారం ఉందని చెబుతోంది.