AB Venkateswara Rao: పదవీ విరమణ చేసిన ఏబీవీ, బాధ్యతలు చేపట్టిన రోజే రిటైర్మెంట్
AP Latest News: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ.. ఇదే రోజు పదవీ విరమణ చేశారు. పలువురు అధికారులు, స్నేహితులు, అభిమానులు సంఘీభావం తెలిపారు.
AB Venkateswara Rao retires on same day: ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ హోదాలో ఏబీవీ పదవీ విరమణ పొందారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ సాయంత్రానికి పదవీ విరమణ పొందడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బాధ్యతలు స్వీకరించిన రోజే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీని కలిసి పలువురు అధికారులు, స్నేహితులు, అభిమానులు సంఘీభావం తెలిపారు. ఏబీవీని కలిసి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎబీవీని కలిసి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌మేట్స్ కావడంతో పరస్పరం క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఏబీవీని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.
ఐదేళ్లుగా ఏబీవీ న్యాయపోరాటం
ఏబీ వెంకటేశ్వరరావు 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉండేవారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పోస్టింగ్ దక్కలేదు. మొదట 6 నెలలు ఆయన ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. తర్వాత రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే నిందలు ఏబీ వెంకటేశ్వరరావుపై మోపారు. దీంతో ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం మే 31, 2019న సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని సవాలు చేస్తూ ఏబీవీ హైకోర్టుకు వెళ్లారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హైకోర్టు ఏబీవీపై సస్పెన్షన్‌ను కొట్టివేసింది.
అయితే, ఏపీ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను కొద్ది రోజుల క్రితమే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తేసింది. అటు హైకోర్టు సైతం ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని.. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలో ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. అలా ఏబీవీని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ డీజీగా ప్రభుత్వం నియమించింది. కానీ, ఏబీవీ పదవి విరమణ చేయబోయే రోజు కూడా ఇదే కావడంతో.. శుక్రవారం (మే 31) బాధ్యతలు స్వీకరించనున్న రోజే సాయంత్రం ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది.