AP CM: విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - జీతాలు పెంచుతూ నిర్ణయం
AP CM: విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. జీతాలు పెంచుతూ, బీమా సదుపాయం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
AP CM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 37 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ శాఖలోని పొరుగు సేవల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
రూ.21 వేలకు పెరగనున్న ఉద్యోగుల ఆదాయం..
ఇటీవల పెరిగిన జీతాల వల్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆదాయం రూ.21 వేలకు పైగా చేరింది. అదనంగా ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యుత్ శాఖలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, వారికి మెరుగైన వేతనం, బీమా కవరేజీని అందజేస్తుండటంతో ప్రభుత్వానికి అండగా ఉండనున్నారు.
ఇటీవలే చర్చలు ఫలించి సమ్మె విరమించిన ఉద్యోగులు
రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది విద్యుత్ సంఘాల జేఏసీ. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) లో భాగంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఏపీఎస్ పీఈజేఏసీ (APS PEJAC) ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది.
10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగుల హెచ్చరిక
ఈనెల 9వ తేదీన పెన్ డైన్, సెల్ ఫోన్ డౌన్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జులై నెలాఖరు నుంచి విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న విషయం తెలిసిందే. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విద్యుత్ సౌధ పరిసరాల్లో పోలీసుల బందోబస్తును విజయవాడ నగర డీసీపీ విశాల్ గున్నీ పరిశీలించారు. ఉద్యోగుల ముసుగులో అసాంఘీక శక్తులు నగరంలోకి చొరబడి అలజడి సృష్టించే అవకాశం ఉన్నందున మందుస్తు చర్యల్లో బాగంగానే గస్తీ ఏర్పాటు చేశామని డీసీపీ వెల్లడించారు.