వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు- చీమకుర్తిలో జగన్ ప్రకటన
చీమకుర్తిలో పర్యటించిన సీఎం జగన్ గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రానైట్ పరిశ్రమ యజమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వెలిగొండకు సంబంధించిన ప్రారంభ తేదీని కూడా ప్రకటించారు. వైఎస్‌తోపాటు బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చీమకుర్తిలో పర్యటించారు.
వైఎస్‌తోపాటు బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహం ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్. ప్రజల గుండెల్లో కలకాలం ఉండే నాయకులు, వారి మంచి పనులకు మద్దతుగా వారిని ప్రజలు మనసులో పెట్టుకుంటారన్నారు. అందుకే ఇలాంటి నాయకులను ఎవరూ మర్చిపోలేరని సీఎం అన్నారు. గాంధీ, అంబేద్కర్, పూలే, అల్లూరి, ప్రకాశం, వైఎస్, వీళ్లను ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటామని ముఖ్యమంత్రి అన్నారు. మరణం వారి శరీరానికే కానీ వారు చేసిన మంచి పనులకు, గొప్ప భావాలకు ఉండదని ఉద్ఘాటించారు.
అందుకే స్లాబ్ సిస్టం
తాను పాదయాత్ర చేసినప్పుడు స్టోన్ కటింగ్, పాలిష్ యూనిట్లకు సంబంధించి సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ రోజు చెప్పినట్టుగానే స్లాబ్ సిస్టం తీసుకొస్తున్నామని చెప్పారు. జీవో ఇష్యూ చేసినట్టు కూడా ప్రకటించారు. వైఎస్ హయంలో స్లాబ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. దీని వల్ల చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు కష్టాల్లోకి వెళ్లిపోయాయన్నారు. దాదాపు 7 వేల యూనిట్లకు లబ్ధి చేకూర్చేలా జీవో నెంబర్ 58 తీసుకొచ్చామని తెలిపారు.
ప్రభుత్వంపై భారం.. అయినా వెనక్కి తగ్గం
22 క్యూబిక్ మీటర్ల వరకు ముడి గ్రానైట్ ప్రాసెస్ చేసే యూనిట్లకు.. సింగిల్ బ్లేడ్‌కు 25వేల రూపాయలు, మల్టీ బ్లేడ్‌కు 54వేల రూపాయలు ఇచ్చేలా స్లాబ్ సిస్టం తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. ఇదే రాయలసీమ సహా వేరే ప్రాంతాల వాళ్లకు అయితే రూ. 22వేలు, రూ. 44వేలు ఇస్తామన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాది 135 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని.. అయినా కూడా వెనక్కి తగ్గమని చెప్పారు. ఈ కొత్త విధానం వల్ల చిన్న యూనిట్లు స్పీడ్ అందుకుంటాయని.. కార్మికులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
విద్యుత్ ఛార్జీలు 2రూపాయలు కట్
ఈ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు.. హెచ్‌టీకి 6 రూపాయల 30పైసలు, ఎల్టీకి 6 రూపాయల 70పైసలు ప్రస్తుతం వసూలు చేస్తున్నట్టు సీఎం గుర్తు చేశారు. ఆ ఛార్జీలపై 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రూ. 210 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలతో ప్రభుత్వంపై 345కోట్ల వరకు భారం పడుతుందని అయినా వెనక్కి తగ్గడం లేదన్నారు సీఎం జగన్. ప్రజలకు మంచి చేసేందుకు ఎంతైనా ఖర్చు పెడతామన్నారు జగన్.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామన్నారు సీఎం జగన్. 2023 సెప్టెంబర్ అంటే ఇంకో ఏడాది తర్వాత వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తైందని... రెండో టన్నెల్ కూడా శరవేగంగా సాగుతోందన్నారు. స్థానిక నాయకురాలు కోరిక మేరకు ఒంగోలు జడ్పీ కార్యాలయ భవానానికి ఇరవై కోట్లు మంజూరు చేస్తున్నట్టు జగన్ తెలిపారు. మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని... దానికి బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడుతున్నట్టు వెల్లడించారు