Andhra Pradesh Budget Sessions : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం- తొలి పద్దు ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి సభా సమావేశాలకు చంద్రబాబు హాజరయ్యారు.
AP Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌తో నెట్టుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ బడ్జెట్ ప్రతులు చదువుతున్నారు. ఆయన తరఫున మండలిలో మంత్రి కొల్లు రవీందర్ బడ్జెట్ చదువుతున్నారు.
ప్రత్యేక వ్యవసాయ బడ్దెట్
రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్‌ను శాసనసభ ముందు ఉంచుతారు. శాసన మండలిలో మంత్రి నారాయణ అగ్రికల్చర్ బడ్జెట్‌ను చదువుతారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టిన తర్వాత రెండు సభలు వాయిదా పడతాయి. తర్వాత బీఏసీ సమావేశమవుతుంది. ఈ శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి... ఏ ఏ అంశాలు చర్చించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపు పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వైసీపీ బహిష్కరణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ ప్రకటించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభా సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. సభలో ఉన్న పక్షాలు రెండేనని... ఒకటి కూటమి అయితే రెండోది వైసీపీ మాత్రమే అన్నారు. తమకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందని అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రతిపక్ష హోదా లేకుంటే సమస్యలపై మాట్లాడేందుకు మైక్ లభించదని అన్నారు. మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వరని.. అదే విషయంపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ఒకే ఏడాదిలో రెండు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లు
ఎన్నికల కారణంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత ఆగస్టు నుంచి నవంబరు వరకు మరో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రెండు ఓట్ ఆన్ అకౌంటర్ల బడ్జెట్‌ల కాలంలో రూ.2,39,025.31 కోట్లకు ప్రభుత్వం ఆమోదం పొందింది. ఇప్పటికే ఏడు నెలల కాలం పూర్తి అయింది. ఇంకో ఐదు నెలల కాలం మాత్రమే ఉంది. అందుకే కేవలం ఈ ఐదు నెలల కాలం కోసం రూ.2.90 లక్షల కోట్లతో ప్రస్తుత బడ్జెట్ రూపొందించారు
తొలిసారి పయ్యావుల కేశవ్ బడ్జెట్
తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుతానికి ఐద నెలలకు మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఇందులో సూపర్ 6కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మరింత సమగ్రంగా బడ్జెట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఫిబ్రవరిలోనే ప్రవేశ పెట్టనున్నారు. పథకాలకు పూర్తిస్థాయిలో ఎంత కేటాయిస్తారు ప్రభుత్వ విజన్ ఏంటన్నది అప్పుడే తేలనుంది. అయినా సరే ఈ బడ్జెట్‌లో కూడా ప్రస్తుతం అమలలో ఉన్న పథకాలకు కేటాయింపులతోపాటు రోడ్ల రిపేర్‌లకు, గ్రామీణాభివృద్ధికి, పోలవరంసహా ఇతర ప్రాజెక్టులకు, అమరావతికి భారీగా నిధులు వెచ్చించారు.