Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ కోసం వాదనలను సోమవారం వింటామని విజయవాడలోని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రేపు (సెప్టెంబర్ 23) వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు లాయర్లు చెప్పగా, అందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. రేపు వాదనలు వినబోమని స్పష్టం చేసింది. ఓవైపు కస్టడీ ఇచ్చిన సమయంలో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఇవ్వడం సరికాదని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. కాబట్టి, చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కస్టడీ గడువు ముగిశాక సోమవారం (సెప్టెంబర్ 25) వాదనలు వింటామని ఏసీబీ కోర్టు జడ్జి స్పష్టం చేశారు.
చంద్రబాబుకి రెండు రోజుల కస్టడీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ కస్టడీకి ఐదు రోజుల పాటు ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది ఏసీబీ కోర్టు.
బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం తీర్పు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు. తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చే ఛాన్స్ ఉందన్న న్యాయవాదులు చెప్పడంతో 2.30కి తీర్పును వాయిదా వేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు కూడా సీఐడీ కస్టడీపై తీర్పు వెల్లడించింది.
కస్టడీ సమయంలో కోర్టు కీలక సూచనలు
కస్టడీలో భాగంగా చంద్రబాబును తాము జైలులోనే విచారణ చేస్తామని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు సీఐడీ అధికారులకు కీలక సూచనలు చేసింది. విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు కోర్టుకు ఇవ్వాలని సూచించింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ చేయాలని చెప్పింది. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లు ఉండడానికి అనుమతించింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. విచారణ సమయంలో షూట్ చేసే వీడియోలు బయటికి రాకుండా చూసుకోవాలని నిర్దేశించింది.