(Source: ECI/ABP News/ABP Majha)
Jaya Prakash Narayana : రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు- జయ ప్రకాశ్ నారాయణ
Jaya Prakash Narayana : రాజధానిపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని జయ ప్రకాశ్ నారాయణ కోరారు.
Jaya Prakash Narayana : రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జయ ప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వా్న్ని కోరారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిపై గందరగోళ సృష్టిస్తోందని ఆరోపించారు. రాజధానిపై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించారు. తుగ్లక్ కూడా తరచు రాజధానులను మార్చారని జేపీ గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో అమరావతిలో రాజధాని అభివృద్ధి చేస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందనన్నారు. లేకుంటే ఏపీ ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడుతుందన్నారు. అందరూ కలిసి అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి అభివృద్ధి ఫలాలు అందేలా ల్యాండ్ పూలింగ్ చేశారన్నారు.
మాతృ భాషలోనే విద్యా బోధన
ఆంధ్ర ప్రదేశ్ లో పాలన గాడితప్పందని, మార్పు రావాల్సిన అవసరం ఉందని జయ ప్రకాశ్ నారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు చేసి పప్పు కూడు పెట్టడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. పేదలకు సంక్షేమ పథకాలు అవసరమే కానీ, సంక్షేమం ఒక్కటే అమలు చేస్తే సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం సాకుతో అభివృద్ధిని విస్మరించకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోన్న మాటలు అవాస్తవమన్నారు. తాను ఇంగ్లీష్ బోధనకు వ్యతిరేకం కాదన్న జేపీ... పిల్లలకు సులువుగా అర్థమయ్యే మాతృభాషలోనే బోధన ఉండాలన్నదే లోక్ సత్తా విధానమన్నారు. ముందుచూపు లేకుండా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇష్టారీతిలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంకలా మారిపోతుందన్నారు.
దేశ చరిత్రలో తొలిసారిగా
"దేశ చరిత్రలో తొలిసారిగా రైతుల పూర్తి సమ్మతితో ల్యాండ్ పూలింగ్ జరిగింది. చాలా కోసం లోక్ సత్తా ఈ మాట చెబుతోంది. ఎక్కువ భూమి సేకరిస్తే వినియోగించగా మిగిలిన భూమి రేటు భారీగా పెరుగుతోంది. ఆ ఫలితాలు అందరికీ దక్కుతాయని లోక్ సత్తా ఎప్పటి నుంచో చెబుతోంది. తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఆ పనిచేసింది. భూములు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. అందరూ చర్చించి చట్టబద్ధంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఇంకొకరు వచ్చి రాజధాని మరో ప్రాంతానికి మారుస్తా అంటారు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్నవాళ్లు ఎక్కువ. దీనిని ఎవరైనా కాదంటారా? . హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మన పిల్లల భవిష్యత్ కోసం రాజధానిని అభివృద్ధి చేయాలి. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు చేయడంలేదు. దేశంలో ఈ పరిస్థితి లేదు. ఎన్నికల్లో ప్రజలు డబ్బులు పంచిపెట్టాలి. అధికారంలోకి వచ్చాక పన్నుల డబ్బులతో ప్రజలకు పందేరాలు పెట్టాలి."- జయప్రకాశ్ నారాయణ
Also Read : Pawan Kalyan: ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా - జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధం: పవన్ కళ్యాణ్