Pawan Kalyan : వారాహి వాహనంలో మచిలీపట్నం బయలుదేరిన పవన్, ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ నుంచి మచిలీపట్నం బయలుదేరారు.
Pawan Kalyan : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రథం వారాహిలో బయలుదేరారు. విజయవాడ ఆటోనగర్ లో పవన్ కల్యాణ్ కు అభిమానులు పవన్ కు గజమాలతో స్వాగతం పలికారు. వారాహి వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ భారీ ర్యాలీగా పవన్ మచిలీపట్నం వెళ్తున్నారు. ఈ సభలో కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, 47 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు పవన్. సాయంత్రం 5 గంటలకు పవన్ మచిలీపట్నం చేరుకోనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు, జనసేన కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
Glimpse of crowd from the rally..#JSP10thFormationDayMeet pic.twitter.com/wiQ3MVxAkB
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2023
జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభ
జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ పదో ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం అయిన వారాహి వాహనంపై సభ వేదిక వద్దకు వెళ్తున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారాహి వాహనంపై సభకు బయలుదేరేలా పవన్ ముందుగా ప్లాన్ చేశారు కానీ పోలీసుల ఆంక్షలతో రూట్ మ్యాప్ లో మార్పులు చేశారు.
కృష్ణా జిల్లాలో పోలీస్ యాక్ట్
అయితే పవన్ సభకు అసలు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అంతే కాదు పవన్ నిర్వహించే రోడ్ షో కు బెజవాడ పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు చేస్తే, చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతే కాదు పార్టీకి చెందిన నాయకులకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ,జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసుపలికిన పోలీసులు జనసేనపై ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల అభ్యంతరంతో పార్టీ ఆవిర్బావ సభకు వెళ్లేందుకు జనసేన అధినేత రూట్ మ్యాప్‌ను కూడా మార్పులు చేశారు. ముందుగా అనుకున్నట్లుగా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీని రద్దు చేసుకున్నారు. పవన్ బస చేసిన నోవోటెల్ హోటల్ నుంచి బయల్దేరి, విజయవాడ శివారులో ఉన్న ఆటోనగర్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి వారాహి వాహనంపై ర్యాలీగా మలిచీపట్నం బయలుదేరారు.
అభిమానం చాటుకున్న ఇప్పటం గ్రామస్థులు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామస్తులు మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ప్రేమ చాటుకున్నారు. తమకు గతంలో పలు సందర్భాల్లో అండగా నిలిచిన నేత అని పవన్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. నేడు మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన సభకు రెండు బస్సులలో ఇప్పటం గ్రామస్తులు సభకు బయలుదేరారు. మచిలీపట్నం సభా ప్రాంగణానికి వచ్చే జనసైనికుల కోసం 5 వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేసి తమ వెంట తీసుకొస్తున్నారు ఇప్పటం గ్రామస్తులు.
విజయవాడలోని ఆటోనగర్ చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి కాసేపట్లో వారాహిలో మచిలీపట్నంకు బయలదేరనున్న పవన్ కళ్యాణ్ గారు.#JSP10thFormationDayMeet pic.twitter.com/xF148XQYtq
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2023