Vijayasai Reddy: జగన్‌పై మరోసారి విధేయత చాటుకున్న విజయసాయిరెడ్డి! కోటరీనే ఆయన టార్గెట్
Andhra Pradesh News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హాని కలిగించేలా మాట్లాడటం, ప్రవర్తించడం జరగదు అని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోటరీ తనను మౌనంగా ఉంచడం లేదన్నారు.

అమరావతి: రాజకీయాల నుంచి తప్పుకున్నాక సైతం వైసీపీ మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మరింత యాక్టివ్ అయ్యారు. తన జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఎప్పటికప్పుడూ వివరణ ఇస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)కి వ్యతిరేకంగా, ఆయనకు హాని కలిగించేలా తాను మాట్లాడానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు విజయసాయిరెడ్డి.
పార్టీని వీడేందుకు కారణం
మాజీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తాను తిరుపతిలో, విశాఖపట్నంలో మాట్లాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని టీవీ చానళ్ళు, పత్రికలు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వైసీపీ అధినేత జగన్ కి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ గానీ, ఆన్ రికార్డు గానీ తాను ఎక్కడా మాట్లాడలేదు అని స్పష్టం చేశారు. ఆయన కోటరీ వల్ల విభేదించి పార్టీని వీడాను కానీ, జగన్ కి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం ఎన్నటికీ జరగదు అన్నారు.
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేను అని.. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో శతృత్వం లేదన్నారు. తాను ఏ విషయం మాట్లాడదలచుకున్నా మీడియా ముందు నేరుగా ఏ సంకోచం, సందేహం లేకుండా మాట్లాడతానని తెలిపారు. లేకపోతే తన అధికారిక 'ఎక్స్' అకౌంట్ ద్వారా చెప్పాల్సిన విషయాన్ని తెలియజేస్తాను కానీ.. తెరవెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు తనవైపు నుంచి ఉండవని క్లారిటీ ఇచ్చారు. తన మీద అవాస్తవాలు ప్రచారం చేయాలని తాపత్రయ పడుతున్న వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.
జగన్ అడిగితే నా మీద మరిన్ని కేసులు వేసుకునేవాడ్ని..
తాను మౌనంగా ఉండటం వైసీసీలోని కోటరీకి నచ్చడం లేదంటూ విజయసాయిరెడ్డి ఇటీవల మరికొన్ని విషయాలను ప్రస్తావించారు. వైసీపీ సోషల్ మీడియాలో తనమీద అబద్దపు పోస్టులు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో 2011 లో 21 కేసులు నామీద వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ అడిగి ఉంటే నాకు సంబంధం లేకున్నా భాద్యత తీసుకుని ఉందేవాడినన్నారు. కానీ కోటరీ వారే తనకు వెన్నుపోటు పొడిచారని, కోటరీ మాటలు నమ్మి జగన్.. 3 తరాలుగా ఆ ఫ్యామిలీకి సేవచేసిన తనను పక్కన పెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేసులు నా మీద వేసుకుంటే మంచివాడ్ని, లేకపోతే మోసగాడు, వెన్నుపోటుదారుడు అని ప్రచారం చేయడం సబబేనా అని కోటరీని ఆయన ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే, ఆ స్కామ్ వివరాలు టీడీపీ వాళ్లకు చెప్పానని కోటరీ అంటోంది. అసలు స్కామే లేనప్పుడు నేను వాటి వివరాలు ఎలా చెబుతాను అని సెటైర్ వేశారు.
1/2: నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి సచ్చటం లేదు. అందుకే నాపై వైఎస్సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 26, 2025






















