Vijaya Sai Reddy Bail: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నిర్ణయం కోర్టుదే.. కోర్టులో సీబీఐ మెమో దాఖలు
జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ మెమో దాఖలు చేసింది.
జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్ నిర్ణయాన్ని కోర్టుకే వదిలిపెట్టినట్లు సీబీఐ తెలిపింది. కోర్టు విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ మెమో దాఖలు చేసింది. సీబీఐ నిర్ణయంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తనకు గడువు కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని రఘురామ కృష్ణ రాజు కోర్టుకు తెలిపారు. వైకాపా పార్లమెంటరీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డి కేంద్ర హోం, ఆర్థిక శాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలుస్తూ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోన్నారని రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అప్పట్లో సీఎం జగన్ ఆస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని ఎంపీ విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి లేఖ కూడా రాశారని రఘురామ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై గత విచారణలో విజయసాయిరెడ్డిని కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు విచారణ తాము ఇచ్చిన నోటీస్‌కు విజయసాయిరెడ్డి స్పందించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలిస్తేనే నోటీసులు తీసుకుంటామని చెప్పినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ ఇచ్చిన నోటీసు ఎందుకు తీసుకోలేదని సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు తమ పదవులను అడ్డం పెట్టుకుని బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ పై జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఈ విషయంలో సీబీఐ నిర్ణయాధికారాన్ని కోర్టుకే వదిలేసింది. ఈ పిటిషన్ పై గత నెలలో విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పును ఆగస్టు 25కు రిజర్వు చేసింది. ఈ నెల 7వ తేదీన ఎంపీ రఘురామ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ బెయిల్ రద్దు నేపథ్యంలో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉన్నాయని బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కోర్టును కోరారు.
Also Read: Bandi Sanjay Padayatra : కేసీఆర్‌పై ఇక సమరమే.. బండి సంజయ్ పాదయాత్ర పేరు " ప్రజా సంగ్రామ యాత్ర"