Uttarandhara Charcha Vedika : బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు 15 శాతం నిధులు కేటాయించాలి - ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర చర్చావేదిక డిమాండ్ !
ఉత్తరాంధ్రకు బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక డిమాండ్ చేసింది. పలు డిమాండ్లతో సీఎం జగన్‌కు చర్చా వేదిక లేఖ రాసింది.
Uttarandhara Charcha Vedika : 2023 - 24 బడ్జెట్‌లో 15 శాతం నిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేటాయించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐదు పేజీల లేఖను ముఖ్యమంత్రికి పంపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోపు వివిధ ప్రజాసంఘాలతో, అన్నీ రాజకీయపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, కో కన్వీనర్ బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. గవర్నర్, బడ్జెట్ ప్రసంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాnvf.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్‌ఖండ్, బోలంగీర్ - కలహండి - కోరాపుట్ తరహా ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని.. అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిపై ఢిల్లీ కి అఖిలపక్ష బృందాన్ని రాష్ట్రప్రభుత్వం తీసుకెళ్ళాలన్నారు. నిబద్దతతో 371-డి ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకే ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా అభివృద్ధి మండలిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తరాంధ్రలోని 30 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. ఉత్తరాంధ్రలో పెండిరగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలి. పెండిరగ్ సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ఒక శ్వేతపత్రం ప్రకటించాలని చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు.
సహజవనరులు ఇక్కడి పేదలకు చెందేలా చూడాలని.. ప్రతి పేద కుటుంబానికి కనీసం హెకాటేరు భూమి అయినా ఇచ్చి, వలసల్ని నివారించాల్సి ఉందన్నారు. అటవీ భూములు, సంపదతో పాటు ఉత్పత్తుల్ని వినియోగించుకునేలా ఆదివాసీలను వారసత్వ సంపదగా ప్రకటించాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి గోదావరి జిలాల్లో ఉత్తరాంధ్ర వాటా ఖరారు చేసి, అది దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరితో ఉత్తరాంధ్రలోని నదులను అనుసంధానం చేయాలని ..విశాఖపట్నంలో డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌ను వెంటనే ప్రారంభించాలని కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు.
విశాఖస్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకొనే విధంగా కేంద్రప్రభుత్వంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సి ఉందున్నారు. విశాఖస్టీల్‌ప్లాంట్‌కు క్యాపిటివ్‌మైన్స్ కేటాయించడానికి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిసిఐ, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక డిమాండ్ చేసింది. గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే స్వంత క్యాంపస్‌లో పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టడంతో పాటు విమ్స్ ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కెజిహెచ్ ఆసుపత్రిని ఆధునీకరించాలి. కొత్త జిల్లాల ప్రకారం అన్నీ జిల్లా కేంద్రాల్లో సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రులు ప్రారంభించాలి. ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ వ్యాధి గ్రస్థులను ఆదుకోవాలి .. ఉత్తరాంధ్ర మరో భోపాల్‌గా మారకుండా పర్యావరణాన్ని రక్షించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక డిమాండ్ చేసింది.