TTD Board Meeting : సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ అప్పుడే, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే!
TTD Board Meeting : భక్తుల రద్దీ తగ్గే వరకూ సర్వదర్శనానికి ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. యంత్రాల సాయంతో లడ్డూ ప్రసాదం, బూందీ తయారీ విధానం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది.
TTD Board Meeting : భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ కొనసాగే వరకూ సర్వదర్శనం భక్తులకు ప్రస్తుత విధానమే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనం స్లాటెడ్ విధానంలో టోకెన్లు కేటాయింపుపై అధ్యాయనం చేస్తున్నామని టీటీడీ తెలిపింది. ఆనంద నిలయం గోపురానికి బంగారు తాపడం పనులకు ఆమోదం తెలిపారు. ఆగమ పండితుల సలహాల మేరకు నెల రోజుల తరువాత పనులు ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
టైం స్లాట్ టోకెన్లపై
ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులకు పాలక మండలి ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలక మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు పాలక మండలిలో ఆమోదం తెలిపామన్నారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. భక్తుల రద్దీ తగ్గే వరకూ సర్వదర్శనంలోనే శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రస్తుత విధానమే కొనసాగిస్తామన్నారు. టైం స్లాట్ టోకెన్ల విధానంపై అధ్యాయనం కొనసాగుతుందన్నారు.
సింఘానియా గ్రూప్స్ తో ఒప్పందం
దేశ వ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకూ నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 7.32 కోట్లతో ఎస్వీ గోశాల పశుగ్రాసం కొనుగోలు చేయనున్నామని తెలిపారు. 2.7 కోట్ల వ్యయంతో పాత పార్వేటి మండపం స్థానంలో నూతన మండపం నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేసినట్లు వెల్లడించారు. తిరుమలలోని ఎస్వీ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు సింఘానియా గ్రూప్స్ తో ఒప్పందం కుదుర్చేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
యంత్రాలతో లడ్డూ ప్రసాదం తయారీ
18 లక్షల వ్యయంతో బేడీ ఆంజనేయస్వామికి బంగారు కవచం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలో ఆరు కోట్లు, బెంగుళూరులో 3.23 కోట్ల విలువైన ఆస్తులు భక్తులు విరాళంగా అందించారని మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ముఫ్పై మూడు లక్షల కేలండర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రికలను ముద్రిస్తున్నట్లు చెప్పారు. యంత్రాల సహాయంతో లడ్డూ ప్రసాదం, బూందీ తయారీపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్ ముడి సరుకుల కొనుగోలుకు మార్క్ ఫేడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఆనంద నిలయం గోపురానికి బంగారు తాపడం చేయించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని, ఆగమ పండితుల సలహాల మేరకు నెల రోజుల అనంతరం తాపడం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నామని తెలిపారు. ఆక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.