TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్- నవంబరు 10న ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
TTD News: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.
TTD News: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. దీనికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను నవంబరు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.
పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో 9 కేంద్రాలలో 100 కౌంటర్లలో డిసెంబరు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేయనున్నట్లు ఈఓ చెప్పారు. ఇందులో భాగంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించి సహకరించాలని ఈఓ కోరారు.
రోజుకు రెండు వేల శ్రీవాణి టికెట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఈఓ తెలిపారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందన్నారు.
గంటలోపు కాషన్ డిపాజిట్ రిఫండ్
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చి యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతోందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్తున్నామని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నారని అన్నారు.
భక్తులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ కాకపోతేనే సంప్రదించాలని కోరారు. రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నారని, ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుంచి 7 రోజులు వేచి ఉండడం లేదని వివరించారు. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్ కోడ్ సబ్‌మిట్ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదని వివరించారు.