Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - స్వామి వారి కానుకలు వేలం ఎప్పుడో తెలుసా?
Andhra News: శ్రీవారి కానుకలను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. వేలాన్ని ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తామని.. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలని అధికారులు తెలిపారు.
TTD Announced Auction Of Hundi Items: తిరుమల (Tirumala) శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకటేశుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో చాలా మంది నగదు సహా కొన్ని వస్తువులను స్వామి వారికి కానుకగా ఇస్తుంటారు. బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, ఖరీదైన కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా ఇతర వస్తువులు కానుకగా సమర్పిస్తుంటారు. వీటిని వేలంలో భక్తులు సొంతం చేసుకునే అవకాశాన్ని దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు. వేలాన్ని ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తామని.. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలని టీటీడీ సూచించింది.
ఏం వేలం వేస్తారంటే.?
తిరుమలతో పాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను వేలం వేయనున్నారు. ఈ నెల 28న భక్తులు సమర్పించిన కెమెరాలను వేలం వేస్తారు. మొత్తం 6 లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న కాపర్ - 2 రేకులు 3 వేల కేజీలను 15 లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. ఈ నెల 31న సిల్వర్ కోటెడ్ రాగి రేకులు 2,400 కేజీలను 12 లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు. టెండర్ లేదా వేలంలో పాల్గొనాలనుకునే భక్తులు మరింత సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ ఆఫీసులో సంప్రదించాలన్నారు. దూర ప్రాంతాల వారు 0877 - 2264429 నెంబరుకు కాల్ చేయడం లేదా www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు.
రూ.300 దర్శన టికెట్లు విడుదల
మరోవైపు, నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన కోటా టికెట్లను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఇప్పటికే అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అటు, వసతి గదుల కోటా టికెట్లను సైతం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తెచ్చింది. https://ttdevasthanams.ap.gov.in సైట్‌లో వీటిని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల - తిరుపతి సేవా కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నవనీత సేవా టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవా టికెట్లను మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ఈ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు
అటు, శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకూ వీటిని రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా వీటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. శుక్రవారం 69,098 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా.. 34,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.