Tirumala Dharshan: తిరుమల శ్రీవారి దర్శనం - ప్రకృతి రమణీయతకు ఈ ప్రదేశాలు నిదర్శనం, సందర్శించారా?
Tirumala Tourist Places: తిరుమల అంటే కేవలం శ్రీవారి దర్శనమే కాదు. కొండల మధ్య, ప్రకృతి ఒడిలో అలరారే ఎన్నో జలపాతాలు, సుందర ప్రదేశాలూ ఉన్నాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!
Tourist Places in Premises of Tirumala: తిరుమల.. ఈ పేరు వింటేనే ఓ ఆధ్యాత్మికానుభూతి. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, ప్రకృతి అందాల నడుమ జాలువారే జలపాతాలు మదిలో కదలాడుతాయి. శేషాచలం కొండల్లో ఏ కొండను చూసిన ఆ ఏడుకొండల వాడి రూపమే దర్శనమిస్తుంది. గోవిందా.. గోవిందా.. అంటూ అల కొండపైనున్న కోనేటిరాయుడి దర్శనానికి వెళ్లే మార్గం ఆద్యంతం ప్రకృతి శోభతో విరాజిల్లుతూ.. ప్రతి భక్తునికి ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. తిరుమల అంటే కేవలం శ్రీవారి దర్శనమే కాదు. ఆలయం చుట్టు పక్కల ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో పర్యాటక ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. మరి ఆ వివరాలేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.!
వరాహ స్వామి ఆలయం
తిరుమల ఉత్తర మాడ వీధిలో ఉండే ఈ ఆలయంలో ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాతే తిరుమల శ్రీవారిని దర్శించాలని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. వరాహ స్వామికి చెందిన 7 కొండలను వెంకటేశ్వరుడికి అప్పగించేందుకు షరతుగా తనకు కూడా సమానంగా పూజలు జరగాలని వరాహ స్వామి కోరికను స్వామి అనుగ్రహించినట్లు పురాణ కథనం. అందుకే తిరుమలను దర్శించే భక్తులు ఈ ఆలయాన్ని ముందుగా తప్పక సందర్శిస్తారు.
గోవింద రాజ స్వామి ఆలయం
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే కోనేటి గట్టున ఉన్న ఆలయం ఈ గోవింద రాజ స్వామి ఆలయం. వెంకటేశుని వివాహానికి కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచిన గోవింద రాజ స్వామి.. అలసి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని పురాణ కథనం. తిరుమలకు వచ్చే భక్తులు ఈ స్వామిని కచ్చితంగా దర్శించుకోవాలి.
తిరుచానూరు
అలిమేలు మంగమ్మ పుట్టినిల్లే ‘తిరుచానూరు’ అని ప్రసిద్ధి. ఇక్కడి అలవేలు మంగమ్మ కొలువై ఉంటారు. స్వామి దర్శనం అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకోకుంటే ఆ యాత్ర ఫలితం దక్కదని చెబుతారు.
శ్రీనివాసమంగాపురం
తిరుపతికి 12 కి.మీ దూరంలో శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. నారాయణవనంలో వివాహం చేసుకున్న స్వామి.. కల్యాణం అనంతరం తిరుమల కొండపై వెలిసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారనేది పురాణ కథనం. భక్తులు ఈ ఆలయాన్ని కూడా కచ్చితంగా సందర్శించాలి.
శిలాతోరణం
తిరుమలకు 11 కి.మీ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన చారిత్రక వారసత్వ సంపద ఈ ‘శిలాతోరణం’. శిలలతో సహజంగా ఏర్పడిన ఈ ప్రదేశం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిపరంగా ఏర్పడిన ఇలాంటి ప్రదేశాలు 3 ఉండగా.. అందులోని ఈ ప్రదేశం ఒకటి కావడం విశేషం.
హథిరాం బాబాజీ మఠం
ఈ మఠం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉంటుంది. ఆ రోజుల్లో హథీరాం బాబా అనే భక్తుడు తిరుమల వచ్చి స్వామి వారితో పాచికలాడేవారట. ఆయన శ్రీవారికి ప్రియ మిత్రుడని కూడా చెబుతారు. ఆయన నివాస స్థలమే ఇదే.
ప్రముఖ జలపాతాలు
- ఆకాశ గంగ తీర్థం - ప్రధానాలయం నుంచి 3 కి.మీ దూరంలో ఆకాశగంగ జలపాతం ఉంది. ఏడాది పొడవునా ఈ జలపాతం నుంచి కొండ పైనుంచి జాలువారుతూనే ఉంటుంది. జలపాతం సమీపంలో ఉండే దేవీ మాత ఆలయంలో భక్తులు పూజలు చేస్తారు. వర్షాల సమయంలో ఆకాశ గంగ మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.
- తలకోన జలపాతం - ఈ ప్రాంతాన్ని తిరుపతిలో మిస్టరీ ప్రాంతంగానే చెబుతారు. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కుకు సమీపంలో ఉండే ఈ అద్భుత జలపాతంలోని నీరు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలానే మిగిలింది.
- కపిల/ తుంబుర తీర్థాలు - తిరుమల కొండపై మెట్ల మార్గంలో ప్రముఖ శైవ క్షేత్రం కపిల తీర్థం ఉంది. కపిల ముని ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్టించిన కారణంగా కపిలేశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. ఎత్తైన జలపాతం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. అలాగే, ప్రకృతి రమణీయత మధ్య తిరుపతికి 8 కి.మీ దూరంలో ఉన్న తుంబుర తీర్థం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడి నీటిలో ఔషధ గుణాలున్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ఈ నీరు పాపాలను తొలగించడమే కాక.. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం కలుగుతుందనేది పురాణ కథనం.
- పాప వినాశనం/ జాబాలి తీర్థం - తిరుమల ప్రధాన ఆలయం నుంచి 3 మైళ్ల దూరంలో పాప వినాశనం తీర్థం ఉంది. ఇక్కడ స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇదే మార్గంలో జాబాలి తీర్థం కూడా ఉంది. ‘జాబాలి’ అనే ముని ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు దర్శనమిచ్చాడని పురాణ కథనం. అంతే కాకుండా వనవాస సమయంలో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడితో కలిసి ఇక్కడ కొంత కాలం ఉన్నారనేది కూడా ఓ కథనం. అలాగే, సమీపంలోని పాండవ తీర్థం, కుమారాధారా తీర్థం, చక్ర తీర్థం, నాగ తీర్థం, శేష తీర్థం సైతం తిరుమల కొండల్లో ఉన్నాయి.
బేడి ఆంజనేయుని ఆలయం
తిరుపతికి 10 కి.మీ దూరంలో బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఒంటె కోసం వెతుకుతున్న హనుమంతున్ని ఆయన తల్లి కట్టేసి ఆకాశగంగకు తీసుకెళ్లినట్లు పురాణ కథనం. అందుకే ఇక్కడ స్వామిని ‘బేడి ఆంజనేయ’ స్వామిగా పిలుస్తారు. ఆంజనేయుడు ఇప్పటికీ అదే ప్రదేశంలో నిలబడతారని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీ పరశురామేశ్వర ఆలయం
రేణిగుంటకు 7 కి.మీ దూరంలో సువర్ణముఖి నదీ తీరాన గుడిమల్లం గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఒకటో శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఇది. ఇక్కడ 7 అడుగుల శివలింగంపై ఓ చేత్తో పరశువు, మరో చేతితో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడే రుద్రుని రూపం దర్శనమిస్తుంది. అద్భుతమైన శిల్ప సంపద ఈ ఆలయం సొంతం. దీన్ని పరశురామాలయం అని కూడా అంటారు.
శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్/ శ్రీవారి మ్యూజియం
తిరుపతి నుంచి 6 కి.మీ దూరంలో తూర్పు కనుమల్లో 350 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఈ వెంకటేశ్వర నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. సుందర జలపాతాలు, జీవ వైవిధ్యతకు ఈ ప్రాంతం చిరునామాగా చెబుతారు. అలాగే, తిరుపతికి 10 కి.మీ దూరంలో శ్రీవారి మ్యూజియం ఉంది. దేవాలయాల నిర్మాణ శైలి, మన చరిత్ర, సంస్కృతి, దేవుని విగ్రహాలు, చిత్రాలు, గ్రంథాలు ఇలా అన్నీ ఈ మ్యూజియంలో పొందు పరిచారు. పర్యాటకులకు విజ్ఞానం అందించడం సహా ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
కాణిపాకం
తిరుపతి పర్యటనలో మరో ముఖ్య ఆలయం కాణిపాకం. వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ గణపతి.. కోరికలు తీర్చే దేవునిగా, చాలా పవర్ ఫుల్ అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ వినాయకుడు పెరుగుతూనే ఉండడం ఈ ఆలయ మరో విశేషం. తిరుపతి నుంచి దాదాపు 70 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.
శ్రీకాళహస్తి
తిరుపతికి దగ్గరగా ఉన్న ఆలయాల్లో మరో ముఖ్య ఆలయం ‘శ్రీకాళహస్తి’. తిరుపతి నుంచి 36 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. స్వర్ణముఖి నదీ తీరాన అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగోది అయిన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుత వాస్తుకళను ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రతిబింభిస్తోంది. గాలిగోపురం, వెయ్యి కాళ్ల మండపాలు ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణలు.
తిరుపతి పర్యటనలో వీటితో ఎన్నో పర్యాటక ప్రదేశాలు చుట్టుపక్కల ప్రాచుర్యం పొందాయి. ప్రతి రోజూ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు ఈ ఆలయాలతో పాటే చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రకృతి సౌందర్యతకు అద్దం పట్టే ఈ ప్రాంతాల సందర్శన మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందనేది భక్తుల భావన.
Also Read: Swami Vivekananda: స్వామి వివేకానంద గురించి ఇలా మాట్లాడితే ఎవరైనా ఇంప్రెస్ అయిపోతారు!