AP News Developments Today: నేడు విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్
వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈరోజు వైజాగ్ లోని ఏయూ గ్రౌండ్స్ లో జరగనుంది. ముందుగా ఆర్కే బీచ్ లో జరగాల్సి ఉండగా వేదికను ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కు మార్చుకున్నారు నిర్వహకులు.
నేడు వైజాగ్ లో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈరోజు వైజాగ్ లోని ఏయూ గ్రౌండ్స్ లో జరగనుంది. ముందుగా ఆర్కే బీచ్ లో జరగాల్సి ఉండగా ఆదివారం కావడంతో జనాన్ని అదుపు చెయ్యలేమనీ.. భద్రతా పరమైన అంశాలు వస్తాయని పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేదికను ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కు మార్చుకున్నారు నిర్వహకులు. ఈరోజు సాయంత్రం ఈ వేడుక జరగనుంది.
రాజశ్యామల యాగానికి హరియాణా సీఎంకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి శుక్రవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. ఢిల్లీ శివారు గుర్గావ్ లో పీడబ్ల్యూడీ బంగ్లాకు వెళ్ళి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు హవనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని అన్నారు. అలాగే హర్యానాలో కురుక్షేత్ర వద్ద గుంతిధామ్ లో ఫిబ్రవరి 11 నుండి 16 రోజులపాటు లక్ష చండీ యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో సాగే యాగంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, యాగ నిర్వహణకు సహకరించాలని హర్యానా సీఎం ఖట్టర్ ను కోరారు.
గూడూరు వైసీపీ మీటింగ్ లో భోజనాల్లో గొడవ, ఎమ్మెల్యే వరప్రసాద్ పై నిరసన.
గూడూరు వైఎస్ఆర్ సీపీ పార్టీ మీటింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం హంగామా సృష్టించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత రాజకీయాలు అంతు చిక్కడం లేదు. ఒకరికొకరు గోతులు తవ్వుకోవాలని చూస్తున్నారు నేతలు. అవకాశం వస్తే, అధిష్టానం వద్ద తమ అసంతృప్తి వెళ్లగక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత భాగంగా ఉన్న తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరులో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఇలాగే వార్తల్లోకెక్కింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురు మూర్తి, ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భోజనాలు సరిగా ఏర్పాటు చేయలేదంటూ కొంతమంది వైసీపీ నేతలు రచ్చ చేయడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ పై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. గడప గడప కార్యక్రమాలతో సపా చాలా చోట్ల ఈ అసమ్మతి బయటపడుతోంది. అయితే ఇప్పుడు భోజనాల విషయంలో కూడా గొడవ పెట్టుకోవడం, అక్కడే ఉన్న బాలినేని దృష్టికి ఆ వ్యవహారం తీసుకెళ్లాలని చూడటం మాత్రం విశేషం. ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఓ దశలో అసహనం వ్యక్తం చేసినా, చివరకు సైలెంట్ అయ్యారు. వైసీపీ మీటింగ్ ని సజావుగా జరిపేందుకు చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.