Tirumala News: తిరుమలలో శాంతి హోమంతో దోష నివారణ జరిగింది- రాజకీయ వివాదం చల్లారేందుకు ఏం చేయాలి?
Tirumala news: తిరుమల శ్రీవారి లడ్డూ పై జరిగిన వివాదం శాంతి హోమంతో దోషం అయితే పోయింది కాని రాజకీయం అయితే శాంతిచే పరిస్థితి లేదు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదు.
Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో కోట్లాది మంది భక్తులు మనోవేధనకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ చేపట్టిన శాంతి హోమంతో అంతా ముగిసింది అనే భావనలో ఉన్నారు.
సున్నితమైన అంశం తిరుమల. ఇలాంటి చోట చాల జాగ్రత్తగా వ్యవహరించడమే కాదు రాజకీయ కోణం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల కేంద్రంగా రాజకీయ ఆరోపణలు.. ప్రత్యారోపణలు చోటు చేసుకోవడం విచారకరం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పారు. తిరుమలలో రాజకీయ చేయబోమని ఆయన ప్రకటించారు. ఆ తరువాత ఉద్యోగుల నియామకం, లడ్డూ నాణ్యత సరిగ్గా లేదని నిపుణులు, లడ్డూ తయారీ చేసే సిబ్బంది చెప్పడంపై టీటీడీలో నిజంగా ప్రక్షాళన జరుగుతుందా అనే విధమైన చర్చ నడిచింది. అనుకోని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నెయ్యి కల్తీపై ప్రకటన చేయడం.. వైసీపీపై నింద వేయడంతో తిరుమల కేంద్రంగా టీడీపీ సైతం రాజకీయం ప్రారంభించారనే ఆరోపణలు మూటగట్టుకుంది.
శాంతి హోమంతో శాంతించేనా..!
తిరుమలలో పవిత్రమైన లడ్డూలో కల్తీ పదార్థాలు కలిశాయని తెలిసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి టీటీడీ పవిత్రత కాపాడేందుకు ఆగమ సలహా మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పవిత్రోత్సవాలు ముగిసాయి అయినా భక్తలు ఇలాంటి చెడు మాట విన్నారు కాబట్టి శాంతి హోమం, క్షమాపణ మాత్రం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని శాస్త్రబద్దంగా పూర్తి చేశారు.
సాయంత్రం భక్తులకు సైతం ఎస్వీబీసీ ద్వారా క్షమాపణ మాత్రం సూచించారు. అంతా అయిపోయింది.. ఇక ఈ వివాదం ఉండదు అనుకునే లోపు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి తిరుమలకు వచ్చారు. ఆయనను పోలీసులు జీఎన్సీ టోల్ గేట్ వద్ద ఆపేసి తిరుమలలో రాజకీయ అంశాలు మాట్లాడమని చెప్పి నోటీసులు ఇచ్చి సంతకాలు చేయించారు. వరాహ స్వామిని దర్శించుకున్నారు. పుష్కరిణి స్నానం చేశారు. స్వామి వారి ఆలయం వద్ద నమస్కారం చేసి బేడి ఆంజనేయస్వామి వారి దర్శనం అనంతరం అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించారు. తన తప్పు ఉంటే కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందని ప్రమాణం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి ఆయనను పంపేశారు. తిరుపతి గరుడ కూడలి వద్ద కూడా అదే పరిస్థితి ఎదురైంది. తిరుమలలో రాజకీయ అంశాలు మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.
తొలుత మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. దానిని మంత్రి నారా లోకేష్ స్వీకరించి ఎదురు సవాల్ చేశారు. అయితే వైసీపీ మీద నింద వేయగా కరుణాకరరెడ్డి మాత్రం ప్రమాణం చేయడం ఏంటని.. అధికారులు రాజకీయం మాట్లాడమని చెప్పి మాట్లాడడం పై తిరుపతిలో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకొని దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని భక్తులు బాధపడుతున్నారు. తిరుమలలో దోష నివారణకు శాంతి హోమం చేశారని... ఇప్పుడు రాజీయ రగడ తగ్గడానికి కూడా ఏదైనా యాగం చేయాలేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Also Read:లడ్డూ వివాదం- కాలినడకన తిరుమలకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్, శ్రీవారి సన్నిధిలో దీక్ష విమరణ