Pawan Kalyan: లడ్డూ వివాదం- కాలినడకన తిరుమలకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్, శ్రీవారి సన్నిధిలో దీక్ష విమరణ
Tirumala Laddu Issue | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లనున్నారు. వచ్చే వారం అలిపిరికి చేరుకుని అక్కడి నుంచి కాలి నడకన మెట్లమార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Pawan Kalyan to visit Tirumala | అసలే మొదలైన తిరుమల లడ్డూ కల్తీ వివాదం జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తిరుమల అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇదివరకే ప్రముఖ కూటమి నేతలు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో తిరుమలలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లనున్నారు. ఆ మరుసటి రోజు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
తిరుమలలో అపచారం జరగడంతో ప్రాయశ్చిత్త దీక్ష
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో జరిగిన అపచారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని తెలిసిందే. స్వామివారు మన తప్పుల్ని మన్నించి, అంతా మంచి చేయాలని కోరుకుంటూ 11 రోజుల దీక్షకు పవన్ శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకుంటారు. అక్టోబర్ 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు.
శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ
తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1, 2వ తేదీన ఉదయం స్వామివారి సన్నిధిలో ఉండనున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను పవన్ విరమిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేశారని తేలడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అక్టోబర్ 3న తిరుపతిలో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ వారాహి సభను విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగించారని నిరూపణ అయ్యాక సైతం వైసీపీ నేతలు తమ అబద్ధాలను ఆపడం లేదని, పైగా తప్పిదాన్ని నిరూపించిన వారిపై, టీటీడీపై సైతం ఎదురుదాడి చేయడం సరికాదని పవన్ సూచించారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు
తాము ప్రమాణానికి డిమాండ్ చేస్తే చంద్రబాబు ఫ్యామిలీగానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఎందుకు రావడం లేదని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నేత భూమన సోమవారం నాడు తిరుమలకు వెళ్లి అక్కడ పుష్కరణిలో పవిత్ర స్నానం ఆచరించి తాము ఏ తప్పు చేయలేదని, తప్పు చేసినట్లు అయితే సర్వనాశనం అవ్వాలని ప్రమాణం చేశారు. తాము ఏ తప్పిదం చేయలేదని, రాజకీయ ఉద్దేశంతోనే తమపై దుష్ప్రచారం జరిగిందన్నారు. ఆపై అగ్నిసాక్షిగా భూమన మరోసారి ప్రమాణం చేశారు. తప్పు చేసిన వారిని తిరుమల వెంకన్న శిక్షిస్తాడని అన్నారు. ప్రమాణం చేసిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు నోటీసులిచ్చిన పోలీసులు, అనంతరం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే.
Also Read: AP Floods Amount: ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ