YS Sharmila: సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఓట్లకు డబ్బులు బాగా ఇస్తారు తీసుకోండి: షర్మిల సంచలనం
Andhra Pradesh News: సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రతి పనికి రేటు ఫిక్స్ చేస్తారని.. ఓట్ల కోసం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Election 2024- సత్యవేడు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని, రాష్ట్రాన్ని 10 ఏళ్లలో చంద్రబాబు, వైఎస్ జగన్ (YS Jagan) సర్వనాశనం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యే లు ఉన్నారట, ఎమ్మెల్యే కొడుకు షాడో ఎమ్మెల్యే అని.. ఓట్ల కోసం ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోవాలంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల న్యాయ యాత్ర కొనసాగుతోంది. సత్యవేడులో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ... సత్యవేడులో ఎమ్మెల్యే ఉన్నాడా ? లేడా? ఎమ్మెల్యే కొడుకు సైతం షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి పనిలో ఒక రేట్ ఫిక్స్ చేస్తారట. ఇక్కడ మొత్తం మట్టి మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారు. ఎన్నికల్లో మళ్లీ నెగ్గేందుకు మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తారు, వాళ్లతో డబ్బులు తీసుకుని ఓటు ఎవరికి వేయాలో ఆలోచించాలని సత్యవేడు ప్రజలకు సూచించారు. సత్యవేడులో ఎమ్మెల్యేగా బాలగురవం బాబు, తిరుపతి ఎంపీగా చింతా మోహన్ లను గెలిపించాలని ప్రజల్ని కోరారు.
వైఎస్సార్ హయాంలోనే అభివృద్ధి..
వైఎస్ఆర్ హయంలోనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగింది. శ్రీ సిటి పెట్టారు.300 పరిశ్రమలు తెచ్చి లక్షమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ దే. గాలేరు - నగరి ద్వారా ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్ 90 శాతం పనులు పూర్తి చేశారు. పెండింగ్ లో ఉన్న మిగతా 10 శాతం పనులను 5 ఏళ్లలో చంద్రబాబుకి, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కి పూర్తి చేయడం చేతకాలేదు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు - వైఎస్ షర్మిల
రాజధాని లేకుండా చేశారు
ఏపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రాజధాని ఒకటి. 10 ఏళ్లు గడుస్తున్నా చంద్రబాబు, జగన్ పాలించినా ఏపీకి రాజధాని లేకుండా చేశారని షర్మిల మండిపడ్డారు. ఇప్పటికీ ఏపీ ప్రజలు హైదరాబాద్,చెన్నై, బెంగళూర్ వైపు చూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదన్నారు. హోదా కోసం చంద్రబాబు, జగన్ పోరాటాలు చేయలేదని.. బీజేపీకి ఇద్దరు బానిసలు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు.
జగన్ పాలనపై షర్మిల సెటైర్లు
ప్రతి సభలోనూ తాను బటన్ నొక్కినట్లు చెప్పే సోదరుడు జగన్ పాలనపై షర్మిల సెటైర్లు వేశారు. ఓ వైపు బటన్ నొక్కుతూ, మరోవైపు నుంచి లాక్కోవడం ఇదే వైసిపి పాలన అని షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ కుంభకర్ణుడు గత నాలుగున్నరేళ్లు నిద్ర పోయాడు, ఇప్పుడు లేచి హడావుడి చేస్తున్నారంటూ ఏపీ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు నోటిఫికేషన్ లు వేస్తే ఉద్యోగాలు వస్తాయా? మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడం నిజం కాదా? జగన్ ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. 60 రూపాయలు బాటిల్ 260 రూపాయలకు అమ్ముతున్నారు. జగన్ హామీలు అన్ని మద్యం షాపులో కనిపిస్తున్నాయి. బూమ్ బూమ్ బీర్లట.. స్పెషల్ స్టేటస్ విస్కీ అంట. డీఎస్సీ బ్రాండి అంట అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ తోనే రాష్ట్రం అభివృద్ది
తాము అధికారంలో వస్తె 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇళ్లులేని పేద కుటుంబానికి 5 లక్షలతో ఇల్లు... మహిళా పేరు మీద ఏటా లక్ష రూపాయలు, ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. వికలాంగులకు 6 వేల పెన్షన్, వృద్దులకు, వితంతువులకు, రూ.4 వేల పెన్షన్, ఉపాది పథకం కింద రోజు రూ.400 ఇస్తామన్నారు.