Tirumala Temple: శ్రీవారి ఆలయానికి ప్రతీ శుక్రవారం పవిత్ర జలాలు ఎందుకు తీసుకొస్తారంటే?
Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా సాగుతోంది. ప్రతీ శుక్రవారం ఆకాశ గంగ జలంతో నిర్వహించే అభిషేకాన్ని కన్నుల పండువగా చేశారు. అనంతరం నిర్వహించాల్సిన అన్ని కైంకర్యాలను చేస్తున్నారు.
Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబర్ ఒకటో తేదీ గురువారం రోజున 63, 332 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26, 656 మంది తలనీలాలు సమర్పించగా... 2.86 కోట్ల రూపాయల హుండీ ఆదాయం నెలకొంది. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 15 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండడంతో, స్వామి వారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.
ఆకాశ గంగ జలాలతో అభిషేకం..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ గంగ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కల్యాణోత్సవం నిర్వహణ..
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడి. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయం కాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు.
చవరగా ఏకాంత సేవ నిర్వహణ..
సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం అర్చకులు శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వ దర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.