TTD News: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి సారె సమర్పించిన టీటీడీ
Tiruttani Subramanya Swamy Temple:
TTD Latest News:
తిరుపతి: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం సారె సమర్పించింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి బుధవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి (Tiruttani Subramanya Swamy Temple) ఆలయ ఛైర్మన్ శ్రీధరన్, ఈవో విజయా, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణాలు చెబుతున్నాయి. టీటీడీ 2006 నుండి ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పారుపత్తేదార్ తులసి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చారిత్రక ప్రాశస్త్యం :
తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసింది తిరుత్తణి దివ్యక్షేత్రం. తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ''ఆరుపడైవీడు'' లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.
ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక విషయానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడి కృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.
టీటీడీ పాలకమండలి మీటింగ్ (TTD Meeting)లో కీలక నిర్ణయాలు ఇవే
టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం (ఆగస్టు 7) తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా తాను పని చేసిన నాలుగేళ్లలో ఎక్కువ మంది సామాన్య భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించేందుకు తాము కొన్నినిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ఎల్1, ఎల్2, ఎల్3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వా మివారి తొలి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తి నిచ్చాయని సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతి, ఇతర సదుపాయాలు మెరుగుపరచడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని, ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. నాలుగేళ్ల పాటు ఛైర్మన్‌గా పని చేసే అదృష్టం ప్రసాదించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తనకు అవకాశం ఇచ్చిన వైఎస్.జగన్‌మోహన్ రెడ్డికి, టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి సుబ్బారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.