Tirumala News: తిరుమలలో శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం, శ్రీవారి సేవలో ప్రముఖులు
Tirumala News Updates: వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
Vaikuntha Dwadashi Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.
వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి మంత్రి శిధిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్ర స్వామి, ఎంపీ గోరింట్ల మాధవ్, ఎమ్మెల్సీలు రామారావు, రఘువర్మ, మైనంపల్లె హనుమంతరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.