TTD News: తిరుమలకు వెళ్లకుండానే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు - ఈ మార్గాల ద్వారా తెప్పించుకోవచ్చు
Tirumala: తిరుమలకు వెళ్లకుండానే డైరీలు, క్యాలెండర్లు తెప్పించుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది. కొత్త ఏడాదివి ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.

TTD has made it possible to bring diaries and calendars without going to Tirumala: ప్రతి రోజూ ఉదయాన్నే దేవదేవుడి చిత్రపటం ముందు కళ్లు తెరవడం చాలా మందికి ఇష్టం. అంతే కాదు రోజువారీ వివరాలను టీటీడీ డైరీలోనే రాసుకుంటే అంతా మంచే జరుగుతుందని అనుకుంటారు. అందుకే టీటీడీ ప్రతీ ఏడాది క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. తిరుమలలో డిసెంబర్ నెలలో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ సారి తిరుమలకు రాని భక్తులు కూడా వీటిని పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
భక్తుల కోసం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు , డైరీలను ఆఫ్‌లైన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల అందుబాటులోకి ఉంచింది. అయితే అందరూ అయా ప్రాంతాలకు వెళ్లలేరు. అందుకే టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. 2025 సంవత్సరానికి సంబంధించి 12-పేజీలు, 6-పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ వెబ్ సైట్‌లో ప్రకటించారు.
గతంలో ఈ డైరీలు, క్యాలెండర్ల కొరత ఉండేది. అందుకే ఎక్కువగా తిరుమలలోనే అమ్మకాలు చేసేవారు. తర్వాత భక్తుల డిమాండ్ కు తగినట్లుగా సరఫరా చేసేందుకు ముద్రిస్తున్నారు. మంచి క్వాలిటీతో ఈ డైరీలు, క్యాలెండర్లను ముద్రిస్తూంటారు. అందుకే భక్తుల నుంచి ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది.





















