Tirumala News: తిరుమల ఉద్యోగులకు గుడ్ న్యూస్- జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలు
Tirumala Tirupati Devastanam News: తిరుమల ఉద్యోగులకు జీతాల పెంపుతోపాటు ఇళ్ల స్థలాల పంపిణీకి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
Tirumala Tirupati Devastanam On Employees: తిరుమలలో ఉద్యోగులకు టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ సమావేశమైన టీటీడీ పాలకమండలి తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ ( గుండుకు ఇంత లెక్కన) పని చేస్తున్న క్షురకులకు జీతాలు పెంచారు. నెలకు 20 వేల రూపాయల కనీస వేతనం అందించాలని నిర్ణయించారు. దీనివల్ల 250 కుటుంబాలకు మేలు జరగనుంది.
టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు 10వేల జీతం పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్‌గా గుర్తించి వేతనాలు పెంచనున్నారు. పెద్దజీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించనున్నారు. పెద్ద జీయర్ మఠానికి ఏటా 60 లక్షలు,చిన్న జీయర్ మఠానికి ఏటా 40 లక్షల అదనపు ఆర్థిక సహాయం చేయబోతున్నారు.
టీటీడీలో మిగతా విభాగాల్లో కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం 3 వేలు పెంచేలా నిర్ణయం తీసుకుంది పాలక మండలి. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 వేల మంది కార్మికులు ప్రయోజనం కలగనుంది. టీటీడీలోని 3518 ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎల్లుండి(గురువారం) తొలి విడతగా మహతి ఆడిటోరియంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయబోతున్నారు. మరో వారం పది రోజుల్లో ఇంకో 1500 మందికి స్థలాలు ఇస్తారు.
ప్రభుత్వానికి 80 కోట్ల రూపాయలు చెల్లించి మరో 350 ఎకరాల భూమి సేకరించి ఫిబ్రవరిలోపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి టీటీడీ తీర్మానం చేసింది. 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఉన్న టైంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు.