Crime News: అత్యాచారం జరగలేదు- తప్పుడు ప్రచారం వద్దు-తిరుపతి బాలికపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
Tirupati Crime News: బాలికపై దాడి కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అత్యాచారం జరిగిందని ప్రచారం చేయడంపై పోలీసులు, తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక సమాచారం లేకుండా ఇలా చేయొద్దని సూచించారు
Tirupati News: తిరుపతిలో బాలికపై దాడి చేసిన కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఎస్పీ సుబ్బారాయుడు... పాపపై అత్యాచారం జరగలేదని తేల్చి చెప్పారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై కేవలం దాడి మాత్రమే జరిగిందన్నారు. ఆమె ఓ ప్రాంతంలో పడిపోయి ఉందని... మైనర్ కావడంతో మొదట విచారణ చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారన్నారు. రాత్రి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో మెడికల్ పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. అత్యాచారానికి గురైనట్టు నిర్ధారణ కాలేదన్నారు.
పరీక్షలు జరుగుతున్న టైంలోనే రాజకీయ పార్టీలు, మీడియా అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం చేశారని సుబ్బారాయుడు తెలిపారు. వైద్యులు, పోలీసులు, పాప తండ్రి ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్టు రాసేశారని అన్నారు. దాడి చేసిన వారు తమ అదుపులో ఉన్నారని విచారిస్తున్నామన్నారు. దాడి చేసిన వారికి పాపతో పరిచయం ఉందని... అన్ని రకాలుగా విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు.
తండ్రి ఆవేదన
ఎర్రవారిపాలెం మండలం ఎల్లమంద పంచాయతీలో ఒక అమ్మాయి స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు ఆకతాయిలు కొట్టి పారిపోయారు. అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన పేరెంట్స్‌కు రోడ్డు పక్కన పడి ఉన్న బాలిక కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్‌కి చేర్పించారు. ఎమ్మెల్యే హాస్పిటల్ దగ్గరికి చేరుకొని తప్పు చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో డాక్టర్లను మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే నాని చెప్పి వెళ్లిపోయారు.
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో దారుణం
— YSR Congress Party (@YSRCParty) November 4, 2024
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు దుండగులు అత్యాచారం
పాఠశాల నుంచి ఇంటికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో అడ్డగించి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం
ఇంకెంత మంది ఆడబిడ్డలు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవ్వాలి @ncbn, హోం మంత్రి… pic.twitter.com/Pz1oMUwEH9
దీన్ని అదునుగా చూసుకొని కొందరు నీచ రాజకీయం చేస్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డపై అత్యాచారం జరిగిందో లేదో తెలియకుండానే దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ కాకముందే, కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని వాపోయారు. తమ బిడ్డ భవిష్యత్తు నాశనం చేస్తున్నారని తమకు రాజకీయాలతో పనిలేదని మా బిడ్డకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చి తమతో మాట్లాడారని న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. రాజకీయాలతో బిడ్డ భవిష్యత్తు నాశనం చేయవద్దని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.