TTD Tickets Online: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ ఆర్జిత సేవా టికెట్ల విడుదలపై టీటీడీ ప్రకటన
Tirumala Tirupati Devasthanam: సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ 18న విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
TTD to release Arjitha Seva Tickets online for September on June 18 | తిరుపతి: కలిగియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటా టికెట్ల విడుదలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్, ఇతర సేవల టికెట్లను జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఆర్జిత సేవాల టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు పేమెంట్ చేసిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.
టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో సేవల టికెట్లు బుకింగ్
జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. జూన్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు అధికారులు సూచించారు. ఓవైపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం, మరోవైపు లాంగ్ వీకెండ్ రావడంతో నాలుగు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
జూన్ 22న అంగప్రదక్షిణం టోకెన్లు
జూన్ 22న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా
జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేయడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సెప్టెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
జూన్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూన్ 24న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల
జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. జూన్ 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవా కోటా ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వీటితో పాటు నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుందని అధికారులు తెలిపారు.