Tirumala Laddu: తిరుమల లడ్డూ తయారీపై ఆ వార్తలు నమ్మొద్దు: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
Tirumala Laddu Fact Check | తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారని టీటీడీ తెలిపింది.
Tirumala Laddu Making Process News | తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలపై నిత్యం ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తుంది. గతంలో శ్రీవారి ప్రసాదం (అన్నదానం)పై, ఆపై లడ్డూ బరువు తగ్గించడం, అన్య మతస్తులు టీటీడీలో ఉన్నారని, ఇలా తిరుమలపై నిత్యం ఏదో ఒక అంశం ప్రచారం జరుగుతోంది. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ (Tirupati Laddu) తయారీపై జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) స్పందించింది. లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు అని, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూను తయారు చేస్తున్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ థామస్ అనే అన్య మతానికి చెందిన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో లడ్డూలు తయారు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఇలా స్పందించి, అసత్య వార్తలను నమ్మవద్దని భక్తులకు సూచించింది.
భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ సూచన
అనాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని తెలిసిందే. ఇటీవల తిరుమల లడ్డూ సైజ్ తగ్గించారని, రేట్లు పెంచారని ప్రచారం జరగగా, టీటీడీ అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. తాజాగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై టీటీడీ అలర్ట్ అయి, క్లారిటీ ఇచ్చింది. ఎన్నో దశాబ్దాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా శ్రీవారి లడ్డూను తయారు చేస్తున్నారని, భక్తులు ఈ విషయంపై ఆందోళన చెందవద్దని పేర్కొంది. కొందరు ఉద్దేశపూర్వకంగా తిరుమల ఆలయంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు లడ్డూ తయారీ విధులను నిర్వహిస్తున్నారు. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తేవడం లాంటి పనులు చేస్తారు. ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో పని చేస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. లడ్డూ తయారీపై జరగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూనే, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాని బుధవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: భక్తులకు అలర్ట్, తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై టీటీడీ ప్రకటన