Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సభ్యులకు బ్రేక్ దర్శనం కోటా పెంపు
Tirumala APNRTS News | ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనం కోటాను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

Tirumala VIP Break Darshan | తిరుపతి: కలియుగదైశం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనే ఎన్ఆర్ఐ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో టీటీడీ కొంత వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం రోజువారీగా వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 మంది ఎన్ఆర్ఐ భక్తులను మాత్రమే అనుమతించేవారు. అయితే ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఆ సంఖ్యను 100 మందికి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఇకపై శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వంద మందికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కలగనుంది. వీరిలో ముఖ్యంగా వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తిరుమల ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం శనివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ ప్రభుత్వ జీఏడీ నుంచి వారి కోటా పెంచాలని జనవరి 6న లేఖ రాశారు. ఆ విజ్ఞప్తిపై స్పందించిన టీటీడీ భక్తుల సౌలభ్యం మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి భక్తులు భారత్ సందర్శనకు వచ్చిన సమయంలో ఆలయానికి వస్తుంటారు.
సుపథంలో ఎన్నారైలకు టికెట్ల జారీ
శ్రీవారిని దర్శనానికి వచ్చే ప్రవాస భారతీయులు (NRI), ఇతర దేశస్థులకు టీటీడీ సుపథం మార్గంలో సులువుగా దర్శనం కల్పించే ప్రివిలేజ్‌ను కల్పిస్తోంది. భారతదేశానికి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో అధికారులు వేసే స్టాంపింగ్ తేదీ నుంచి 30 రోజులలోపు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయానికి దక్షిణాన ఉన్న సుపథంలో రూ.300 ఎస్‌ఈడీ టికెట్ జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. వీరికి లిమిట్ అనేది ఉండదు. కేవలం బ్రహ్మోత్సవాలు, శ్రీవారి ఆలయంలో ఇతర ప్రముఖ వేడుకల సమయంలో అవకాశం కల్పించరని తెలిసిందే.
Also Read: Sita Kalyanam: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!






















