Tirumala Hundi Collection: జూలైలో శ్రీవారి హుండీకి భారీ ఆదాయం, రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించుకున్న భక్తులు
Tirumala Temple Hundi Collection: తిరుమలలో వరుసగా ఐదవ నెల శ్రీవారి హుండీకి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. జూలై నెలలో హుండీ ద్వారా ఏకంగా 139.45 కోట్ల ఆదాయం లభించింది.
TTD Hundi Collection In July: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైయున్న పుణ్యక్షేత్రం తిరుమల. కోర్కేలు తీర్చే కోనేటి రాయుడు కాబట్టి శ్రీనివాసుడికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. కోరిక నెరవేరిన వేంటనే నగదుతో పాటుగా బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా, మణులు మణిక్యాలు పొదిగిన కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు భక్తి భావంతో సమర్పిస్తుంటారు. అంతేకాకుండా స్వామి వారి పేరిట కోట్ల విలువ చేసే భూమి పత్రాలు కూడా స్వామి వారిపై అపారమైన భక్తి శ్రద్దలతో సమర్పిస్తుంటారు. ఇలా దేశ నలువైపులా నుండి తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ రూపాల్లో వారి వారి స్థోమత తగ్గట్టుగా కానుకలను సమర్పిస్తుంటారు. భక్తుల సమర్పించిన కానుకలను అత్యంత భధ్రత నడుమ వాటిని లెక్కించి భధ్రత పరుస్తుంది టీటీడీ..
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం..
కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఏప్రిల్ మాసం నుండి సర్వదర్శనం భక్తులను అనుమతించింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల రద్దీతో స్వామి వారి హుండీ ఆదాయం క్రమేపి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో టిటిడి చరిత్రలోకే జూలై మాసంలో శ్రీవారికి అత్యధికంగా హుండీ ద్వారా కానుకలు అందాయి. ఈ ఏడాది మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్ మాసంలో 127.5 కోట్లు, మే నెలలో 130.5 కోట్లు, జూన్ లో 123.76 కోట్ల రూపాయలు హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం లభించగా, జూలై మాసంలో హుండీ ద్వారా ఏకంగా 139.45 కోట్ల ఆదాయం లభించింది.
గత 4 నెలల్లో భారీగా కానుకలు..
చివరి నాలుగు మాసాల్లో 649.21 కోట్ల రూపాయలు స్వామి వారికి కానుకలు అందాయి. వరుసగా ఐదో నెల 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటింది. జూలై నెలలోనే ఐదుసార్లు 5 కోట్ల రూపాయల మార్క్ ని హుండీ ఆదాయం చేరగా, జూలై 4వ తేదీన స్వామి వారికి 6.18 కోట్ల హుండీ ఆదాయం లభించింది. 1954 జూన్ లో స్వామి వారికి 5,35,703 కోట్ల హుండీ ఆదాయం రాగా, 2015-2016 సంవత్సరంలో ఏకంగా 1010 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా వ్యాప్తికి ముందు 2019- 2020- 2021 సంవత్సరాల్లో హుండీ ఆదాయం చాలా మేరకు తగ్గింది. కరోనా సమయంలో స్వామి వారిని దర్శించలేని భక్తులు ఒక్కసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం అధిక సంఖ్యలో విచ్చేస్తుండడంతో క్రమేపి హుండీ ఆదాయం పెరుగుతోంది.
Also Read: Monthly Horoscope: ఆగస్టు నెలలో ఈ రాశులవారికి వాహనప్రమాదం ఉంది జాగ్రత్త
కరోనాతో కుదేలు !
ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని ఉపద్రవం కరోనా వ్యాప్తి రూపంలో వచ్చింది. కరోనా వ్యాప్తితో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 83 రోజుల పాటు శ్రీనివాసుడి దర్శనంకు భక్తుల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. భక్తుల అనుమతి రద్దు చేసి ఏకాంతంగా స్వామి వారికి కైంకర్యాలను నిర్వహించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతిస్తూ వచ్చింది టీటీడీ. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే టీటీడీకి లభించింది. ప్రతి ఏటా అంచనా వేసే టిటిడి బడ్జెట్ సైతం అంచనా తప్పింది.