Tirupati Politics : తిరుపతిలో పవన్ పోటీ చేస్తారని ప్రచారం - జనసేన, వైఎస్ఆర్‌సీపీ పోటాపోటీ రాజకీయాలు!
తిరుపతిలో పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ వైఎస్ఆర్‌సీపీ నేతలు సామాజికవర్గ కోణంలో రాజకీయాలు ప్రారంభించారు.
Tirupati Politics : ఏపీ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులు.. కొన్ని నియోజకవర్గాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. తిరుపతిలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో అటు జనసేన.. ఇటు వైఎస్ఆర్‌సీపీ తమ ప్రయత్నాలను ..పార్టీ కార్యక్రమాల్లో వేగాన్ని పెంచాయి. జనసేన పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటోంది . వైఎస్ఆర్‌సీపీ కూడా అదే పని చేస్తోంది. దీంతో పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పవన్ పోటీకి తిరుపతి బెటరన్న అభిప్రాయం !
తిరుపతిలో పవన్ పోటీ చేాయలని అక్కడి పార్టీ నేతలు చాలా కాలంగా కోరుతున్నారు. అచ్చి వచ్చి సీటు అయిన తిరుపతికే పవన్ ఈ సారి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. అందుకే జనసేన నాయకులు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యచరణ చేపట్టిన జనసేన వర్గీయులు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో చిరంజీవి తిరుపతి నుంచి విజయం సాధించారు. ఈ సారి పవన్ కూడా విజయం సాధిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు యువతలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకులు తమ తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు.
వారసుడిని బరిలోకి దించే యోచనలో భూమన !
తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. తన కుమారుడు అభినయ్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేయించుకున్నారని చెబుతున్నారు. జగన్ వారసులకు ఈ సారి టిక్కెట్ ఇచ్చేది లేదని చెప్పారని అంటున్నారు..కానీ కరుణాకర్ రెడ్డి మాత్రం తన కుమారుడికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారని అటున్నారు. అందుకే తనయుడిని ప్రతినిత్యం ప్రజలకు దగ్గర చేసే విధంగా తిరుపతిలో కార్యక్రమాలు చేపడుతూ కుమారుడి ఎలాగైనా ఎమ్మెల్యేగా చూడాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.
పవన్ పోటీ చేసినా కుమారుడ్ని గెలిపించుకునేలా భూమన ప్రయత్నాలు!
పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఉందన్న సమాచారంతో తిరుపతి స్ధానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూనే తుడా కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమంను నాయకులతో కలిసి చేపట్టారు ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో జగన్ న్ని చూసి నేర్చుకోవాలని, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్ సామాజికవర్గాన్ని వైసీపీ వైపు ఉంచేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ .. కాపు సామాజికవర్గాన్ని కించ పరిచారని ఆయన నిరసన చేపట్టారు.
పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీ చేస్తారో లేదో కానీ ఇప్పటికైతే తిరుపతిలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఇప్పుడు టీడీపీ కూడా జనసేనకు మద్దతిచ్చే అవకాశఆలున్నాయని.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారంతో మరింతగా వేడి పెరగనుంది.
పవన్ ఢిల్లీ వెళ్లారా ? బీజేపీ హైకమాండ్ పిలిచిందా ? నిజం ఏమిటంటే ?