(Source: ECI/ABP News/ABP Majha)
Lokesh About Women: భూమి కంటే ఎక్కువ భారం మోసేది మీరే - మహిళలకు లోకేష్ పాదాభివందనం
Interntional Womens Day 2023: భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని.. అమ్మ లేనిదే మనకు జన్మ లేదు అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
పీలేరు నియోజకవర్గం... భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని.. అమ్మ లేనిదే మనకు జన్మ లేదు అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చింతపర్తి విడిది కేంద్రం వద్ద మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మహిళలకు నారా లోకేష్ పాదాభివందనం చేశారు. రాజకీయాల్లో లేకున్నా కూడా తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా వైసిపి నాయకులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదని, చిన్న వయస్సు నుండే మగవాళ్లకు మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ బుధవారం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అమ్మలేకపోతే మనకు జన్మలేదని, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలు మోస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని, మహిళా మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను అన్నారు. మహిళలు అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని ఈ సందర్భంగా లోకేష్ ప్రశ్నించారు. జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయి. మరో 900 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయి. సిఎం సొంత నియోజకవర్గం లో నాగమ్మ అనే మహిళ పై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని లోకేష్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అడిగిన కొన్ని ప్రశ్నలకు యువనేత లోకేష్ సమాధానాలిచ్చారు.
ప్రశ్న - సమాధానం
ధరణి.. విద్యా రంగంలో ఇంకా మహిళలు వెనకబడి ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది మహిళలు చదువుకోవడానికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు.
లోకేష్.. ఎక్కువ మంది మహిళలు చదువు కోవడానికి, డ్రాప్ అవుట్స్ లేకుండా చెయ్యడానికి టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం. ప్రత్యేక కళాశాలలు, ఉన్నత విద్యకు సహాయం, విదేశీ విద్యకు సహాయం అందిస్తాం.
సావిత్రి.. భద్రత విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ మహిళలకు సమాన హక్కులు లేవు.
లోకేష్.. సమాన వేతనం కోసం గతంలో అనేక చర్యలు తీసుకున్నాం. అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించడం తో పాటు మంచి జీతాలు ఇవ్వాలని మేము కంపెనీలను కోరేవాళ్లం.
ఉష.. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సంఘమిత్రలను వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొలగించింది.
లోకేష్.. ఎన్నికల ముందు కులం, మతం చూడము అన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ లో ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుంచి సంఘమిత్రల వరకూ అడ్డగోలుగా తొలగిస్తున్నారు. ఆఖరికి డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు కూడా సీఎం జగన్ ప్రభుత్వం కొట్టేసింది.
శోభారాణి.. గత ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చింది. చిన్న ఇల్లు కట్టుకున్నాను. ఒన్ టైం సెటిల్మెంట్ లో 10 వేలు కట్టాను. స్థానిక వైసిపి నాయకులు నా ఇళ్లు కబ్జా చేశారు. ఏం చేయాలి?
లోకేష్.. నీ తరపున నేను పోరాడతా. వన్ టైం సెటిల్మెంట్ ఒక పెద్ద మోసం. 10 వేలు కట్టించుకొని ఇచ్చిన ధ్రువ పత్రం తీసుకొని రుణం కోసం బ్యాంక్ కు వెళ్తే బయటకి పొమ్మని తిడుతున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఇంటి స్థలం మీకు ఇప్పిస్తా.
కుసుమ కుమారి.. మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురాగలరా?
లోకేష్.. మహిళల్ని మోసం చేసింది జగన్. దిశ చట్టం లేకుండానే సీఎం జగన్ హడావిడి చేశారు. 900 మహిళలపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నారు జగన్.. మోసం చేసి ఇప్పుడు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పు తెచ్చాడు జగన్. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తా అన్న జగన్ మోసం చేశారు. 45 ఏళ్లకు బీసీ, ఎస్టీ, ఎస్సీ మహిళలకు పెన్షన్ ఇస్తా అని మోసం చేశాడు జగన్.
నాగవేణి.. ఇళ్ల స్థలం అడిగినందుకు వైసిపి నాయకులు కేసు పెట్టించారు. మాకు న్యాయం చేయండి
లోకేష్.. వైసిపి పెట్టే కేసులకు బయపడొద్దు. అక్రమ కేసులు పెట్టిన అధికారులపై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం చర్యలు తీసుకుంటాం.
లక్ష్మి కాంతమ్మ.. విదేశీ విద్య పథకం రద్దు అయ్యింది. మీ ప్రభుత్వం వస్తే ఇస్తారా?
లోకేష్.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తాం. గతంలో నేరుగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసే వాళ్ళం. జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అపేసి విద్యా దీవెన, వసతి దీవెన పెట్టి మోసం చేశారు. ప్రతి ఏడాది 32 వేల నుండి 38 వేల ఫీజు ఉంటే తల్లి ఖాతాలో 10 వేలు వేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది ఆ 10 వేలు కూడా ఇవ్వలేదు. విద్యా దీవెన, వసతి దీవెన వలన ఒక్కో కుటుంబం పై నాలుగేళ్లలో లక్ష రూపాయిల భారం పడుతుంది. వాలంటీర్లు వచ్చి టిడిపి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. హామీ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసింది చంద్రబాబు గారు.
పెన్షన్ ను రూ.200 నుంచి రూ.2000 చేసింది చంద్రబాబు
అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పండుగ కానుకలు, చంద్రన్న భీమా, పెళ్లి కానుకలు ఇచ్చింది చంద్రబాబు. రూ.200 పెన్షన్ రూ. 1800 పెంచి రూ.2000 చేసింది చంద్రబాబు అని లోకేష్ అన్నారు. జగన్ వచ్చిన తరువాత అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది జగన్. రూ.250 చప్పున రూ.750 పెన్షన్ పెంచడానికి జగన్ కి నాలుగేళ్లు పట్టింది. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, 8 వ సారి పెంచబోతున్నాడు. ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ దేశంలోనే నంబర్ 1. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటాయి. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన చరిత్ర జగన్ కి మాత్రమే ఉంది. 10 రూపాయిల కుడి చేత్తో ఇచ్చి 100 రూపాయిలు ఎడమ చేత్తో కొట్టేస్తున్నారు జగన్. ఇచ్చే పది రూపాయిల పై జగన్ బొమ్మ ఉంటుంది. కొట్టేసే 100 రూపాయిల పై జగన్ బొమ్మ ఉండదు అని సెటైర్లు వేశారు.
జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు
వైఎస్ జగన్ పాలనలో మహిళలకు గౌరవం, రక్షణ, భరోసా లేదని టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. వైసిపి పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, గంజాయి మత్తు లో మృగాళ్లు రెచ్చిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు రమ్య అనే దళిత యువతిని చంపేస్తే వెంటనే స్పందించి పోరాడింది తమ నేత లోకేష్ అని గుర్తుచేశారు. రమ్య కుటుంబానికి నాయ్యం చెయ్యాలని పోరాడితే లోకేష్ పై వైసిపి ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు.