Tirumala Brahmotsavam Schedule: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ, వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు
Tirumala Tirupati Brahmotsavam Dates 2024 Dates | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెలలో నిర్వహించనున్నారు. రెండు నెలల ముందు నుంచే టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు మొదలుపెట్టింది.
Tirumala Tirupati Brahmotsavam Dates 2024 Schedule Here | తిరుపతి: కళియుగ దైవం శ్రీవారి క్షేత్రం తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెలలో ఘనంగా నిర్వహించనున్నారు. మరో రెండు నెలల సమయం ఉన్నందున, వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు శ్రీవారి ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం నాడు అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శనివారం (ఆగస్టు 3న) సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశం జరిగింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్‌నెస్, లడ్డూ బఫర్ స్టాక్, శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, భక్తులకు వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్ పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్ విభాగం (TTD Vigilance) భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9వ తేదీన స్వర్ణరథం, అక్టోబర్ 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అందుకే అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8వ తేదీన అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఎన్‌ఆర్‌ఐలు, వయోవృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శనివారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల తొలి సమీక్షా సమావేశంలో ఎస్‌విబిసి సిఇఓ షణ్ముఖ్‌కుమార్, సీఈ నాగేశ్వరరావు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!