Somireddy Comments: అప్పట్లో పెద్దిరెడ్డికి చంద్రబాబు సాయం, లేకుంటే దివాళా తీసేవాడు - సోమిరెడ్డి వ్యాఖ్యలు
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితర నాయకులు పరామర్శించారు.
2014 వరకూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థిక పరిస్ధితి, కంపెనీలు మూతపడి దివాలా తీసే సమయంలో టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు సహాయం చేయకుంటే ఆయన ఎక్కడ ఉండేవాడో గుర్తు చేసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం (ఆగస్టు 7) మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో అంగళ్ళు, పుంగనూరు ఘటనలో గాయపడిన టీడీపీ నాయకులనూ, కార్యకర్తలనూ మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు పరామర్శించారు.. పార్టీ అండగా ఉంటుందని నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పించారు. అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇది పెద్దిరెడ్డి రాజ్యమా లేక ప్రజాస్వామ్యమా అనేది అర్ధం కావడం లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంలో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవానికి వెళ్తే, వైసీపీ గుండాలు జెండాలు పట్టుకుని రోడ్ల మీద కొచ్చి టీడీపీ నాయకులపై దౌర్జన్యం చేస్తూ, దాడులు చేయించి, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మీరే దాడులు చేసి, మీరే బంద్ చేయడం మొగుడిని కొట్టి మొగశాలి ఎక్కిన్నట్లుగా ఉందన్నారు. 2014 దాకా ఆర్థికంగా నష్టపోయి, ఆఖరికి ఐపీ పెట్టే పరిస్ధితి నీకు వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 8 నెలల్లో వందల కోట్లు పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయడంతో నువ్వు కోలుకున్నావని గుర్తు చేసుకోవాలన్నారు.
తమ నాయకుడికి బలహీనత ఏంటంటే అధికారంలో ఉన్నా అందరిని సమానంగా చూసే మనస్తత్వం ఉందన్నారు. 2014కు ముందు నీ ఆర్ధిక పరిస్ధితి, కంపెనీ మూత పడి దివాలా తీసేదని పెద్దిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు సహాయం చేయకుంటే ఎక్కడ ఉండే వాడివో నువ్వు గుర్తు చేసుకోవాలని పెద్దిరెడ్డికి సూచించారు. చంద్రబాబుతో పాటు నల్లారి కిషోర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి కారులో పోతుంటే వారిపై వివిధ రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టించేందుకు సిగ్గుందా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు.
జగన్, పెద్దిరెడ్డే కారణం
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో పుంగనూరు, అంగళ్ళులో విధ్వంసానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డిలే కారణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు.. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకుడు రోడ్డుపై వెళ్తుంటే ఆయన కాన్వాయ్ కి ఎదురెళ్లే విధంగా ఎస్పీ రిశాంత్ రెడ్డి వైసీపీ శ్రేణులను ప్రేరేపించారన్నారు. చంద్రబాబు పర్యటనలో వైసీపీ గుండాలు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారని, ఆయన రాకముందే అంగళ్లలో విధ్వంసం సృష్టించారని దీని వెనక జగన్ ఉన్నారని ఆరోపించారు. కేవలం సీఎం ఆదేశాల మేరకే ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు పర్యటనలో విధ్వంసానికి కారకులయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి నలుగురిపై కేసు నమోదు చేయాలని, మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పుంగనూరుకి వెళ్ళకుండా బైపాస్ లో వెళ్తుండగా ఎస్పీ రిశాంత్ రెడ్డి తన సిబ్బందితో చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ విధ్వంసానికి కారణంమైన ఎస్పీ రిశాంత్ రెడ్డిపై న్యాయ పోరాటంగా కేసు వేస్తామన్నారు. ఐపీఎస్ అధికారి అయి ఉంది వైసీపీకి తొత్తుగా మారి సెక్షన్లను కూడా మార్చి దుర్మార్గానికి పాల్పడుతున్నారని, వీరిపై టీడీపీ రాజీలేని పోరాటానికి సిద్ధమవుతోందని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.