Ganja Smuggling: ట్రావెలింగ్ బ్యాగ్‌లో గంజాయి- ముసుగు వేసుకొని ఎస్కేప్‌కు ప్లాన్- కిలేడీ స్కెచ్‌కు పోలీసులు షాక్
చిత్తూరు పోలీసుల అదుపులో కిలాడి లేడీ.. ట్రావెలింగ్ బ్యాగ్‌లో గంజాయి పట్టుకొని బురఖా ధరించి ఎస్కేప్ అయ్యేందుకు ప్లాన్. ముందే పసిగట్టి పట్టుకున్న పోలీసులు.
చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి గంజాయి స్మగ్లర్స్ రెచ్చి పోతున్నారు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు రకరకాల పద్దతులను ఎంచుకుంటున్నారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా గంజాయి అక్రమంగా బోర్డర్ దాటించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు స్మగ్లర్స్.
ఎవరికి అనుమానం రాకుండా ఓ మహిళ బురఖా ధరించి ట్రావెలింగ్ బ్యాగ్‌లో గంజాయిని అక్రమంగా తరలించి పోలీసులకు బురిడి కొట్టించింది. రహస్యం అందించిన సమాచారం మేరకు నిఘా ఉంచి పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో మోస్టు వాంటెడ్ క్రిమినల్ మోహన్ బాబును అదుపులోకి తీసుకుని మూడు లక్షల రూపాయలు విలువ గల దాదాపు 14 కేజీల గంజాయిని చిత్తూరు పోలీసులు సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా ముఠాను చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి మీడియా ముందు హాజరు పరిచారు.
చిత్తూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తమిళనాడు, కర్ణాటక బోర్డర్ వద్ద వాహనాలను తరచూ తనిఖీ చేసి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తున్నారు. కానీ కొందరు గంజాయి స్మగ్లర్స్ తెలివి మీరిపోయి వివిధ రకాల పద్దతులతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. అలాంటి వెరైటీ కేసును పోలీసులు ఛేందించారు.
బుధవారం ఉదయం చిత్తూరు పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు తిరుపతి - బెంగళూరు బైపాస్‌లోని వరిగిపల్లె ఓవర్ బ్రిడ్జి వద్ద కాపు కాశారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో గంజాయి అక్రమ రవాణా బాగోతం బయట పడింది. వారు అక్రమంగా నిల్వ ఉంచిన 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
విజయవాడకు చెందిన సుమతి అనే మహిళ, నర్సీపట్నానికి చెందిన ఈశ్వరరావు వద్ద నుంచి 14 కేజీల గంజాయిని కొనుగోలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా ట్రావెలింగ్ బ్యాగ్‌లో ఉంచుకొని బురఖా ధరించి బస్సులో తరలించే ప్రయత్నం చేసింది. తుని నుంచి విజయవాడకు తీసుకొచ్చి, అక్కడి నుంచి మరొక బస్సులో ప్రయాణం చేసి చిత్తూరుకు చేరుకుంది. ఎప్పటిలాగే పృథ్వీరాజు సహాయం తీసుకొని ద్విచక్ర వాహనం చిత్తూరులో గంజాయిని విక్రయించే క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ మోహన్ బాబు, సుమతి, పృథ్విరాజ్, మోహన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డిఎస్పి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.