Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సద్గురు, శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు- కీలక సూచనలు సైతం
Tirumala Laddu Row : తిరుమల లడ్డు వివాదంతో ఆలయాలు ప్రభుత్వాల అజమాయిషీ నుంచి బయటపడాలన్న సద్గురు, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. భక్తులే దేవాలయాలను నిర్వహించేలా నిర్ణయాలు రావాలన్నారు.
Tirumala Laddu Row : తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో హిందూ ఆలయాలు ప్రభుత్వాల గుప్పిట్లోంచి బయట పడాలన్న డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఆలయాల మేనేజ్‌మెంట్ విషయంలో సమూల మార్పులు అవసరమని సద్గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సూచించారు.
ఆలయాలను భక్తులకే అప్పచెప్పాలి:
ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గి.. భక్తులే ఆలయ విషయాలు చూసుకునే పరిస్థితి వస్తే తిరుమల లడ్డూ వివాదం వంటి మహాపరాధాలు భవిష్యత్‌లో జరగకుండా అడ్డుకోగలమని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఈ మేరకు X వేదికగా ట్వీట్ చేసిన ఆయన.. భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో జంతు కొవ్వు కలిసి ఉండడం మహాపరాధంగా పేర్కొన్నారు. అందుకే భక్తులే ఆలయాలు నడిపాలని.. ప్రభుత్వాలు గుడులపై తమ పెత్తనాన్ని విడనాడాలని తామంతా కోరేదన్నారు. ఎక్కడైతే భక్తితత్పరత ఉండదో అక్కడ పవిత్రతకు కూడా అవకాశం ఉండదన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు బదులు భక్తులే ఆలయాలు నడపాల్సిన ఆవశ్యకత రానే వచ్చిందని.. ఆలయ ప్రసాదం కలుషితమైందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్దారణ చేసిన తర్వాత సద్గురు ఈ మేరకు వ్యాఖ్యానించారు.
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కూడా సద్గురు జగ్గీ వాసుదేవ్ తరహా భావనలనే వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు ఉందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల హృదయాలకు గాయం చేయడం సహా తీవ్ర మనోవేదనకు గురి చేసిందని రవి శంకర్ ట్వీట్ చేశారు. హిందూ ఆలయాలను భక్తులకు, మతగురువులకు అప్పగించడానికి ఇంతకన్నా సరైన సమయం లేదన్నారు. అంతే కానీ స్వార్థంతో నిండి పోయిన అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకుల చేతుల్లో ఆలయాలు ఉండడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని రవిశంకర్ పేర్కొన్నారు. నెయ్యి సహా స్వామి వారి సేవకు వాడే అన్ని పదర్థాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని.. తప్పు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
The Tirupati laddu row has inflicted a deep wound and rage in the Hindu psyche. It is high time that temple management is overseen by, and handed over to, religious leaders and devotees, rather than self-serving officials, ruthless business people and politicians.#TirumalaLaddu…
— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) September 21, 2024
తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంలో పిల్ :
తిరుమల లడ్డు వివాదంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు హిందూ సేన ప్రెసిడెంట్ సుర్జిత్ సింగ్ యాదవ్ పిల్ దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఈ ఘటన కోట్లాది మంది హిందువుల మనోవేదనకు గురి చేస్తోందని.. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్ష వేసినప్పుడే హిందూ ధర్మానికి న్యాయం జరుగుతుందని అతడు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం, విపక్ష వైకాపా మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని వైకాపా విమర్శిస్తుండగా.. ల్యాబ్ రిపోర్ట్స్ చెబుతున్న వాస్తవాలను కూడా వైకాపా పక్కదారి పట్టించాలని చూస్తోందని తెలుగుదేశం మండిపడుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి చంద్రబాబును నివేదిక కోరగా.. చంద్రబాబు చర్యలను తీవ్రంగా మందలించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి వైకాపా అధ్యక్షుడు జగన్ లేఖ రాశారు.