Kurnool Politics: పత్తికొండ వైసీపీలో టికెట్ లొల్లి, నువ్వానేనా అంటూ ముగ్గురు పోటీ!
Pattikonda Constituency: పత్తికొండ నియోజకవర్గంలోని అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో టికెట్ కోసం రేసు మొదలైంది.
Pattikonda Constituency Politics: ఆ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో టికెట్ మార్పు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నియోజవర్గంలో టికెట్ కోసం ముగ్గురు రేసులో ఉన్నారు. ఐ ప్యాక్ సర్వేతో నువ్వా నేనా అంటూ ఆ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. టికెట్ కోసం రేసులో ఉన్న ఆ ముగ్గురు ఎవరు..?
పత్తికొండ నియోజకవర్గంలోని అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో టికెట్ కోసం రేసు మొదలైంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ ముగ్గురు కూడా వ్యూహలు రచించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే గా గెలిచిన కంగాటీ శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ వస్తుందని దీమాగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో తన గెలుపు కోసం పని చేసిన మురళీధర్ రెడ్డితోపాటు మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు నాగరత్నమ్మ, అల్లుడు రామచంద్రారెడ్డి దూరం పెట్టారు.
గత ఎన్నికల్లో అందరి సహకారంతో గెలుపును దక్కించుకున్న శ్రీదేవి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఏపనైనా తన కనుసన్నల్లోనే జరిగేలా అధికారులకు, పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేసారని నియోజవర్గంలో చర్చ..మరోవైపు తన గెలుపునకు ఎన్నికల్లో పని చేసిన వారిని బలహీన పరిచేవిధంగా వారి పనులు జరగకుండా అడ్డుకుంటూ వస్తున్నారనే సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శైస్తున్నరు. . సొంత పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం వంటి వ్యతిరేక పనులు చేయించడంతో మురళీధర్‌రెడ్డి వేరు వర్గం ఏర్పాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఆ ప్రకటనతో అలజడి మొదలు
సిట్టింగ్ ఎమ్యెల్యే శ్రీదేవి వచ్చే ఎన్నికలపై పార్టీ నాయకులతో కసరత్తు చేస్తుంటే పార్టీలో మరో వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి పత్తికొండ టికెట్ తమ కుటుంబానికేనని బహిరంగ ప్రకటన చేశారు.దీంతో పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఎమ్మెల్యే విధానాలతో పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆమె కార్యక్రమాలు దూరంగా ఉంటూ వచ్చారు. సొంతంగా పోచిమిరెడ్డి సేవాదళ్ పేరిట స్వచ్ఛంద సంస్ధ ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్లడంతోపాటు పార్టీ కార్యక్రమాలను సొంతంగా నిర్వహించుకుంటూ మరో వర్గాన్ని తయారు చేసుకున్నారు.ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ రాకుండా చూసేవిధంగా ఎత్తుగడలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. చివరి అస్త్రంగా జగన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలతో తన కూతురికే పత్తికొండ టికెట్ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇందులోభాగంగానే వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికే పత్తికొండ టికెట్ అంటూ బహిరంగ ప్రకటన చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మూడు వర్గాలుగా
స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవికే మళ్లీ టికెట్ అన్న ప్రచారం ఉన్నప్పటికీ జగన్ కుటుంబంతో మురళీధర్ రెడ్డి సన్నిహిత సంబంధం ఉంది. దీనికి తోడు ఏడాది క్రితం జగన్ సమీప బంధువుతో కూతురు వివాహం జరిపించాడు. ఇప్పుడు మురళీధర్ రెడ్డి చెబుతున్నట్లే ఆయన కుటుంబానికే టికెట్ వస్తుందా అన్న ఆయోమయంలో పార్టీ వర్గాలు సమాలోచన చేస్తున్నాయి. ఏదేమైనా సొంత వర్గం ఏర్పాటు కోసం ఎన్నికల్లో వెంట నిలిచిన వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే ఎమ్మెల్యే శ్రీదేవికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాల్లే మాట్లాడుకుంటున్నాయి. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు నాగరత్నమ్మ, అల్లుడు రామచంద్రారెడ్డిలు కూడా గట్టిగానే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.
పత్తికొండ నియోజకవర్గ వైసీపీలో నాయకులు ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయినట్టు స్పష్టంగా తేలిపోయింది. పార్టీకి ఇది తీరని నష్టాన్ని చేకూర్చనుందని శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు ఐ ప్యాక్ ఇచ్చిన సర్వే ప్రకారం టికెట్ ఇస్తామన్న వైసీపీ హైకమాండ్ మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కు టికెట్ ఇస్తారా.. లేక మురళీధర్ రెడ్డికా.. నాగరత్నమ్మకు టికెట్ వస్తుందా అనేది చూడాలి.