Students Protest: భోజనం సరిగ్గా లేదంటూ విద్యార్థుల ఆందోళన!
Students Protest: తినే అన్నం కూడూ సరిగ్గా లేదంటూ ఇంటర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వేలకు వేలు డబ్బులు తీస్కుంటున్న యాజమాన్యం సరైన భోజనం కూడా పెట్టడం లేదని వాపోతున్నారు.
Students Protest: తిరుపతి జిల్లాలోని చెర్లోపల్లిలో ఇంటర్ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తమకు పెట్టే అన్నం ఏమాత్రం బాగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్న యాజమాన్యం.. సరైన మంచి నీటిని కూడా అందించడం లేదని చెబుతున్నారు. ఒక్కో విద్యార్థి దగ్గర, ఎక్కో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మొత్తంలో ఫీజులు తీసుకున్నా.. భోజనం కూడా సరిగ్గా పెట్టకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు.
వసతులు లేవు
ఇదే విషయమై కళాశాల ఏఓను అడిగారు విద్యార్థులు. తమను నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై ప్రశ్నలు అడిగారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని నిలదీశారు. తాగే నీళ్లు శుద్ధమైనవి కావని గట్టిగా అడిగారు. విద్యార్థులు అలా ప్రశ్నించడంతో ఆ అధికారి దురుసుగా జవాబు ఇచ్చాడు. అవే నీళ్లు పెడతాం.. మీ ఇష్టం ఉంటే తాగండి, లేదంటే ఊరుకోండి అంటూ దురుసుగా మాట్లాడారని విద్యార్థులు చెబతున్నారు. కట్టలు కట్టల డబ్బులను ఫీజుల రూపంలో లాక్కునే ఈ ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం కనీస వసతులు కల్పించడంలో విఫలం అవుతోందంటూ విద్యార్థులు వివరిస్తున్నారు. తాము చెల్లించిన ఫీజులు వెనక్కి ఇస్తే వేరే కళాశాలకు వెళ్లిపోతామని అంటున్నారు. అక్కడ ఉండి చదివి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఇంటికి వెళ్లిపోవడమే మంచిది అంటున్నారు. ఎలాగైనా సరే తమ డబ్బులు తమకు ఇవ్వడంతో పాటు టీసీలు కూడా ఇచ్చేయాలని ప్రాధేయపడుతున్నారు.
చాలీచాలని భోజనం
క్యాంటీన్, కిచెన్, బాత్రూమ్స్... ఇలా ప్రతీ చోటు దుర్వాసన వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వాసన చాలా మందికి పడక వాంతులు అవుతున్నాయని, ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పారు. అసలే వర్షా కాలం, ఆపై ఈగలు, దోమల కారణంగా కళాశాల మొత్తం కంపు కొడుతోందని వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్న కళాశాల యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులకు మెస్ లో చాలీచాలని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోమారు భోజనం కోసం వెళితే తిప్పి పంపిస్తున్నారని చెబుతున్నారు. ఆ భోజనం సరిపోక కొన్నిసార్లు అర్థాకలితో అలమటించామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు..
ఫ్యాకల్టీ లేదు
విద్యార్థుల నుండి వేలకు వేలు తీసుకుంటున్న ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం చేయడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుండి ఒక్కో విధంగా ఫీజులు వసూలు చేశారని కాలేజీ యాజమాన్యంపై విద్యార్థులు మండిపడుతున్నారు. చదువులు చెప్పేందుకు ఫ్యాకల్టీని కూడా నియమించడం లేదని అంటున్నారు. సరైన ఫ్యాకల్టీ లేక తరగుతులు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు. సిలబస్ పూర్తి కాక ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. ఫ్యాకల్టీ కోసం పలు మార్లు అడిగినా తీరు మారడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువులు ఇప్పించాలన్న ఉద్దేశంతో తమ తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి ఎన్ఆర్ఆ కళాశాలలో చేర్పిస్తే... ఈ కాలేజీలో చదువు అస్సలు బాలేదని చెబుతున్నారు. చదువులు చెప్పే సార్లే లేనప్పుడు విద్యార్థులు ఏం చదువుతారని ప్రశ్నిస్తున్నారు.