Nara Bhuvaneshwari: ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేయాలి: నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న నారా లోకేష్ కు ప్రజలంతా సహకారం అందించాలని నారా భువనేశ్వరి కోరారు.
Nara Bhuvaneshwari: రేపటితో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో ఆమె పర్యాటించారు. ఈ సందర్భంగా గోకుల్ హెరిటేజ్ రెండోవ పార్లర్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం స్థానికులతో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై హెరిటేజ్ సిబ్బందితో కొంత సేపు ముచ్చటించారు. పార్లర్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వినియోగదారులు కోరిక మేరకూ కాశిపెంట్లలో రెండొవ గోకుల్ హెరిటేజ్ పార్లర్ ను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోకుల్ ఉత్పత్తులు నాణ్యమైనవని ఆమె పేర్కొన్నారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం 200 రోజులు పూర్తవుతుందని చెప్పారు. భగవంతుడు లోకేష్ కు మరింత శక్తిని ఇవ్వాలని, ప్రజల కోసం నారా లోకేష్ పోరాడుతున్నాడని అన్నారు. టీడీపీ క్యాడర్ చాలా వరకు దెబ్బతిందని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వాళ్ల అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. కానీ సమస్యలు కప్పి పుచ్చి, అణగ దొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రజల తరపున లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. రేపు తమ కుటుంబ సభ్యులు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలంతా సహకరించి పాదయాత్రను దిగ్విజయం చేయాలని నారా భువనేశ్వరి కోరారు.
బుధవారం ఎన్టీఆర్ సంజీవని ప్రారంభించిన భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పం ప్యాలెస్ రోడ్డులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సంజీవని’ మెడికల్ క్లినిక్, సంచార ఆరోగ్య రథాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. తొలుత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. పెద్ద బంగారు నత్తంలో మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో శాంతిపురం మండలం శివ పురం వద్ద నిర్మాణంలో ఉన్న సొంతింటి పనులను పరిశీలించారు.
లోకేశ్ పాదయాత్రపై భువనేశ్వరి భావోద్వేగం..
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుప్పంలో మంగళవారం పర్యటించిన భువనేశ్వరి మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చారు. తొలుత పాదయాత్ర చేస్తుంటే తన కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. లోకేశ్ తనకు ధైర్యం చెప్పిన తర్వాత తనలో మనోధైర్యం వచ్చిందన్నారు.