Kuppam Chandrababu: అన్ని లెక్క పెట్టుకుంటున్నా, అన్ని లెక్కలు తీర్చేస్తా- కుప్పంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ ప్రభుత్వం కుప్పంపై కక్ష కట్టి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు అని చంద్రబాబు ఆరోపించారు. కానీ తమ హయాంలో పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ హయాంలోనే కుప్పం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంకు హుంద్రి నీవా నీళ్లు తీసుకువస్తే.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం ఒక్క పని కూడా పూర్తి చేయలేదు అని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గం రాళ్ళ బూదుగురు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వం కుప్పంపై కక్ష కట్టి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు అని ఆరోపించారు. కానీ తమ హయాంలో పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబుకు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
కుప్పంలో రౌడీయిజం చేస్తూ, తనపై కూడా దాడి చేసే పరిస్ధితికి వచ్చారని.. తాను అనుకుంటే సీఎం గానీ, సీఎం మనుషులు గానీ బయటకు రారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచికి, శాంతికి మారు పేరు కుప్పం అని, కుప్పంలో గానీ, రాష్ట్రం గానీ రౌడీలను అనగదొక్కెస్తా అన్నారు చంద్రబాబు. చోటా మోటా పేటీఎం వైసీపీ నాయకులు కుప్పం నియోజకవర్గాన్ని దోపిడీ చేశారు. వైసీపీ దొంగలను తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
టిడిపి అధినేత @ncbn గారు చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.#CBNinKuppam pic.twitter.com/rTnm13rXCu
— Telugu Desam Party (@JaiTDP) June 14, 2023
వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైసీపీ నేతలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తాం. కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వకుండా ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. పోలీసులు వ్యవస్థ దారుణంగా వ్యవహరిస్తున్నారు. తప్పు చేసి ఏ ఒక్కరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయంగా మారిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోనే పాపులర్ కుప్పం గ్రానైట్..
కుప్పం గ్రానైట్ రాష్ట్రంలోనే చాలా పాపులర్ అని.. గ్రానైట్ ను వైసీపి దోపిడి దొంగలు దోచుకుంటున్నారు అని ఆరోపించారు. వైసీపీ నేతలు దోచుకున్నది మొత్తం కక్కిస్తాం. ఏపీ సీఎం జగన్ అవినీతిపరుడని బీజేపీ జాతీయ అధ్యక్షుడే చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజల ధనంను అప్పనంగా దోచుకుంటున్నారు. రెండు వేల రూపాయలను బ్రాందీ షాపుల్లో వైసీపి దొంగలు మార్చుకుంటున్నారని ఆరోపించారు. పేద వారిని ధనకులుగా చేయడానికి సంపదను సృష్టిస్తా. పేదలకు టిడిపి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. మైనారిటీ సోదరులకు ఒక్క కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయలేదు అన్నారు.
కేసులు పెట్టిన వారిని వదిలి పెట్టను..
టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలి పెట్టను. కుప్పం ప్రజల రుణం తీర్చుకునే అవకాశం మరోసారి ఇస్తారని కోరారు చంద్రబాబు. అయితే వైసీపీ నేతల తప్పులు లెక్క పెడుతున్నాను, అన్ని లెక్కలు తీర్చేస్తా అన్నారు.





















