(Source: ECI/ABP News/ABP Majha)
YCP MLC Bharat: నారా లోకేశ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దళిత సంఘాల నిరసన
YCP MLC Bharat: నారా లోకేష్ దళితులపై చేసిన వ్యాఖ్యలపై కుప్పంలో నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు.
YCP MLC Bharat: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితులపై చేసిన అనుచిత వాఖ్యలను నిరసిస్తూ కుప్పం మున్సిపల్ మొదటి వైస్ ఛైర్మన్ మునస్వామి ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి. మాజీ సీఎం నారా చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేష్ దిష్టిబొమ్మలతో కుప్పం కొత్తపేట నుంచి కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు, లోకేష్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. నారా లోకేష్ దళితులను హేళన చేయడం సరికాదని చిత్తూరు ఎమ్మెల్సీ, వైసీపీ నేత భరత్ అన్నారు. అణగారిన వర్గాలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు పాలనలో దళితులకు పెద్ద పీట వేసినట్లు వెల్లడించారు.
బీసీ ద్రోహి సీఎం జగన్: లోకేష్
తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు వంటిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ సర్కారు, సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీసీ ద్రోహులుగా అభివర్ణించారు లోకేశ్. టీడీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచితే వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లను కుదిరించారని లోకేశ్ ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ విడిది కేంద్రం వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వం బీసీ కుల ధ్రువీకరణ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. వైసీపీ పాలనలో గొర్రెల కాపరులకు ఎటువంటి సహాయం అందడం లేదని ఆరోపించారు. దూదేకుల ముస్లిం కుటుంబాలకు, రజకులకు ఏపీ సర్కారు ఎటువంటి సాయం చేయడం లేదని లోకేశ్ ముందు ఆయా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు వంటిదని లోకేశ్ అన్నారు. బీసీలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నమ్మించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశారని ఆరోపణలు గుప్పించారు. బీసీలపై 26 వేల అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకు వస్తామని లోకేశ్ చెప్పారు. న్యాయ పోరాటానికి కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందిస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని తెలిపారు. వాల్మీకిలు ఏ వృత్తిలో ఉన్నా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి రాయితీ రుణాలు అందిస్తామని లోకేశ్ వివరించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ షర్టు విప్పి.. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు వేశారని ఆరోపించారు నారా లోకేశ్. మంత్రి సురేష్ కు నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారిపై దమనకాండకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఎందుకు ప్రశ్నించడం లేదని లోకేశ్ ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ మొదలుకుని డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మంది దళితులను వైసీపీ నాయకులు చంపేస్తే ఆదిమూలపు సురేష్ అప్పుడు ఎందుకు నోరు విప్ప లేదని లోకేశ్ నిలదీశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇకనుంచైనా దళితుల కోసం పాటుపడాలని లోకేశ్ గుప్పించారు.